నిరంతర స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం

నిరంతర స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం

భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ‘వందేమాతరం’ అనే గర్జన ఒక స్ఫూర్తిమంతమైన రణ నినాదం. అది నాటినుంచి నేటి పరిస్థితుల వరకు నిరంతరం ఉత్తేజాన్ని అందిస్తూ.. భవిష్యత్ భారత సమగ్రాభివృద్ధి పథానికి అవసరమైన ప్రేరణాదాయకమైన మంత్రం. 150 ఏళ్ల క్రితం బంకించంద్ర చటర్జీ.. భారతదేశపు ఔన్నత్యాన్ని, సామాజిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని వివరిస్తూ.. భారతమాత శక్తి, సామర్థ్యాల్ని వివరిస్తూ.. ఈ ప్రేరణతో  దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి ఒక్కరూ శక్తినంతా కూడదీసుకుని ఎదురు తిరగాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ అద్భుతమైన పదజాలంతో ‘వందేమాతరం’ గీతాన్ని రాశారు. 

ఈ గీతం దేశ స్వాతంత్ర్య సాధన సంకల్పానికి  బలమైన ఊపిరులూదింది.  ప్రతి భారతీయుడి గుండె లోతుల్లోంచి వచ్చిన ఈ యుద్ధనాదం.. బ్రిటిష్ పాలకులకు నిద్రలేకుండా చేసింది. ఆంగ్లేయుల ఆగడాలను ఇక ఏమాత్రం సహించబోమని.. యావద్భారతం స్వరాజ్య సాధనకు మూకుమ్మడిగా వేసిన అడుగులకు ఇదొక సరికొత్త ఉద్యమ వేదిక, స్ఫూర్తి గీతిక ‘వందేమాతరం’. స్వాతంత్ర్యానంతరం కూడా ‘వందేమాతరం’ నిత్యస్ఫూర్తిని రగిలిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సంకల్పించిన ఆత్మనిర్భర భారత నిర్మాణానికి మార్గదర్శిగా నిలుస్తోంది.

నిత్య మార్గదర్శిని

గత నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ‘వందేమాతరం’ గీతం స్ఫూర్తిని గుర్తుచేస్తూ.. ‘ఈ గీతంలోని మొదటి పదమే మన గుండెలోతుల్లో దేశభక్తి భావనను రేకెత్తిస్తుంది. వందేమాతరం అనే ఒకే పదంలో ఎన్నో భావాలున్నాయి. ఎన్నో శక్తులున్నాయి. ఈ గడ్డపై పుట్టిన ప్రతి పౌరుడిపై భారతమాతకున్న వాత్సల్యాన్ని వందేమాతర పదం తెలియజేస్తుంది. ఇదే పదం మనకు భారతమాత దివ్యత్వాన్ని బోధిస్తుంది. 

కఠిన సమయంలో వందేమాతరం నినాదం 140 కోట్ల భారతీయులను ఐకమత్య భావనతో ఏకంచేస్తుంది. 19వ శతాబ్దంలో రచించిన.. ఈ గీతంలో భావన కొన్నివేల ఏళ్ళనాటి భారతదేశపు అమరమైన చైతన్యంతో ముడిపడి ఉంది. ఇదే భావాన్ని వేదాల్లో ‘మాతా భూమి: పుత్రో అహం పృథివ్యా’  అని పేర్కొన్నారు. అంటే.. ఈ భూమి నా తల్లిలాంటిది, నేను ఈ తల్లి బిడ్డను అని అర్థం.

1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు కూడా దేశం నలుమూలలా ‘వందేమాతర’ గర్జన ప్రతిధ్వనించింది. 1920లో సహాయనిరాకరణ ఉద్యమమైనా, 1930లో శాసనోల్లంఘన ఉద్యమమైనా, 1942లో క్విట్ ఇండియా ఉద్యమమైనా.. ప్రతిచోటా ‘వందేమాతర’ నినాదమే సింహగీతికై.. ప్రజల్లో ప్రేరణను కలిగించడంతోపాటుగా.. బ్రిటిషర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.

 బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్న చివరి క్షణాల్లోనూ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నోటినుంచి వచ్చిన తారకమంత్రం ‘వందేమాతరం’. అందుకే ఇంతటి పవిత్రమైన మంత్ర స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ‘వికసిత భారత’ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్ష. 

కాంగ్రెస్ అభ్యంతరం

1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో.. పండిట్ విష్ణు దిగంబర్ పలుస్కర్  ‘వందేమాతరం’ గీతాన్ని పాడేందుకు సిద్ధమవగా.. సభలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా ముస్లిం లీగ్ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు.. వందేమాతర గీతంలోని రెండు చరణాలను మాత్రమే స్వీకరించాలని 1937లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దేశభక్తికి, ఐక్యతకు ప్రతీక అయిన ఈ గీతాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా, దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అగౌరవపరిచింది.  2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రప్రభుత్వం ‘వికాస్ భీ, విరాసత్ భీ’ అనే ఆలోచనతో ముందుకెళ్తోంది.  

దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూనే.. మన చారిత్రక మూలాలను, స్ఫూర్తి మంత్రాలను సమయానుగుణంగా యావద్దేశానికి గుర్తుచేస్తూ వివిధ  కార్యక్రమాలను చేపట్టింది. ప్రజల్లో నిరంతరం దేశభక్తి భావనను ప్రజ్వరిల్లింపజేస్తోంది.  స్వదేశీ ఉత్పత్తులకు మద్దతివ్వడం, దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వడం వెనక కూడా ‘వందేమాతర’ నినాదమే స్ఫూర్తి.   ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేకిన్ ఇండియా’ వంటి కార్యక్రమాల పునాదులపై ‘వికసిత భారత నిర్మాణం’ సంకల్పం.. సాకారం దిశగా సాగుతోంది. 

ప్రజాసహకారం.. స్వదేశీకి ఊతం

 ప్రజల సంపూర్ణ సహకారానికి.. ఇటీవలి దీపావళి బిజినెస్ ఒక చక్కటి ఉదాహరణ. ఈసారి దీపావళికి గతేడాదికంటే.. 25% అదనంగా అంటే.. రూ.6.05 లక్షల కోట్ల వ్యాపారం దేశవ్యాప్తంగా జరిగింది. ఇందులో బంగారు ఆభరణాలు, నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్స్, గిఫ్ట్ ఐటమ్స్, రెడీమేడ్ దుస్తులు, హోమ్ డెకోర్స్, తినుబండారాల వంటి వివిధ అంశాలున్నాయి. ఇందులో విశేషం ఏమిటంటే.. ఈసారి అమ్మకాల్లో దాదాపు 87% మంది, ప్రధానమంత్రి ఇచ్చిన ‘స్వదేశీ’ పిలుపుతో.. దేశీయంగా చేసిన ఉత్పత్తులను కొనేందుకే ఆసక్తి చూపించారు. ఇది భవిష్యత్ భారతం ఆత్మనిర్భరతా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయిగా నిలిచిపోనుంది. 

అంతేకాకుండా.. చాలా మంది ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్ కంటే.. దుకాణాలకు వెళ్లి, వస్తువులను కొనుగోలు చేయడంపై దృష్టి సారించడం.. నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. దాదాపు 28% అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. దేశీయ తయారీ రంగానికి, మన చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ఇది బాటలువేస్తుంది. 

జీఎస్టీ 2.O  సంస్కరణలతో  అందుబాటులోకి ధరలు

జీఎస్టీ 2.O ద్వారా  తీసుకొచ్చిన  సంస్కరణల  కారణంగా  నిత్యావసర  వస్తువుల ధరలు పూర్తిగా అందుబాటులోకి  రావడం,  దేశీయంగా అమ్మకాలకు బీజం వేసిందని, ఇది వినియోగదారుడు, వ్యాపారస్తుల మధ్య విశ్వాసాన్ని పెంచిందని  నిపుణులు చెబుతున్నారు. ప్రధాని మోదీ స్వయంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, జీఎస్టీలో నూతన సంస్కరణలు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల తయారీదారులకు రుణసదుపాయాన్ని మెరుగుపరచడం, ఇతర సౌకర్యాలను అందించడం,  డిజిటల్ పేమెంట్స్​కు మరింత  ప్రోత్సాహం అందించడం.. వంటి వాటి కారణంగా ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లు మంచి లాభాలను పొందాయి. ఇవన్నీ ‘వందేమాతరం’ భావనను బలోపేతం చేసుకుంటూ.. మళ్లీ భారత్​ను విశ్వగురును  చేసే  దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితానికి ఉదాహరణలు.  

‘నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్’ భావనను నరనరాన నింపుకుని.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో ముందుకెళ్లేందుకు అన్ని విధాలా కృషిచేస్తోంది.  2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.  ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం మరోసారి శక్తిరూపంలో ప్రపంచానికి ఆలంబనగా ఎదుగుతోంది. ఆ స్ఫూర్తితో మనమంతా వికసిత భారతంకోసం పునరంకితం అవుదాం.  మనమంతా ‘వందేమాతర గీతం 150 శతాబ్ది ఉత్సవాల’ స్ఫూర్తితో.. కలిసి పనిచేద్దాం. ‘స్వదేశీ’ వస్తువులను మరింత విస్తృతంగా వినియోగంలో కి  తీసుకొద్దాం. వందేమాతరం.

సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం!

బంకించంద్ర తన గీతంలో  భారతదేశం ఇలా ఉండాలని,  మనకు మార్గదర్శనం చేశారు. అందుకే వందేమాతర గీతంలోని ప్రతి అక్షరంలో దైవత్వం, దివ్యత్వం ఉంది. ఈ నినాదం మనకు నిత్యం ప్రేరణగా ఉంటుంది.  అందుకే  వందేమాతర గీతానికి 150వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలి. 

రాబోయే తరాల కోసం ఈ సంస్కార ప్రవాహాన్ని మనం ముందుకు నడిపించాలి’ అని పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో స్వాతంత్ర్యం కోసం బెంగాల్‌‌‌‌లో ‘సంథాలీల తిరుగుబాటు’ జరిగిన సందర్భంలో.. ఆ సంత్‌‌‌‌ల వీరోచిత పోరాటాన్ని ‘ఆనంద మఠ్’ పుస్తకంలో అక్షరబద్ధం చేసిన బంకించంద్ర చటర్జీ.. దేశాన్ని ఒక తల్లిగా, ఒక ఆత్మగా, యావద్భారతాన్ని ఏకం చేసే శక్తిగా కీర్తిస్తూ రాసిన అద్భుతమైన గీతమిది.  150 ఏళ్లనాటి ఈ వందేమాతర గీతమే.. తర్వాతి కాలంలో భారతదేశంలో తలెత్తిన ఉద్యమాలకు రణనినాదంగా స్ఫూర్తినింపింది.

- జి.కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి