
- ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలోకి?
- 2,000 చ.కి.మీ. వరకు విస్తరించే చాన్స్
- ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఇప్పటికే 51 గ్రామాలు ఓఆర్‌ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో విలీనం
- ఒకటే కార్పొరేషన్‌గా ఉంచడమా?
- రెండు కార్పొరేషన్లుగా విభజించడమా?
- ఢిల్లీ, ముంబై కార్పొరేషన్లను స్టడీ చేస్తున్న ఆఫీసర్లు
- త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి దాదాపు 625 చదరపు కిలోమీటర్లు ఉండగా.. మున్సిపాలిటీల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలో మీటర్లకు విస్తరించనుంది. అప్పుడు దేశంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్దసిటీగా గ్రేటర్ హైదరాబాద్ అవతరిస్తుంది. కాగా.. ఓఆర్‌ఆర్ వరకు గ్రేటర్ సిటీకి మొత్తంగా ఒక్కటే కార్పొరేషన్ ఉండటమా? నార్త్, సౌత్ లేదంటే ఈస్ట్, వెస్ట్ గ్రేటర్ సిటీలుగా రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా?.. అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ లాంటి సిటీల విస్తీర్ణం ఎంత ? ఆయా కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయి? అనే విషయంపై అధికారులు స్టడీ చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం ఉంటే తలెత్తే పాలనాపరమైన ఇబ్బందులపైనా సర్కారుకు ఓ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మొత్తంమీద ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం దాదాపు ఖరారు అయినప్పటికీ.. కార్పొరేషన్లు ఎన్ని ఉండాలనే దానిపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఔటర్ అవతలి మున్సిపాలిటీల్లో త్వరలోనే డీలిమిటేషన్
మున్సిపల్ఎలక్షన్ల కోసం ఓఆర్‌ఆర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లో డిలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆయా చోట్ల ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో ఎలాంటి హడావిడి కనిపించడంలేదు. వాటిని గ్రేటర్ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలో భాగంగానే పక్కనపెట్టారనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం ఇటీవల ఓఆర్‌ఆర్ పరిధిలో, ఓఆర్‌ఆర్ బయట అంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు ఇద్దరేసి సెక్రటరీలను నియమించింది. ఓఆర్‌ఆర్ లోపల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కనుక వాటి అభివృద్ధిని పర్యవేక్షించడానికి ఒక సెక్రటరీని, ఓఆర్‌ఆర్ అవతల ప్రాంతాల అభివృద్ధికి మరో సెక్రటరీని నియమించారు. గ్రేటర్ విస్తరణలో భాగంగానే ఇద్దరు సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తున్నది. ఓఆర్ఆర్వెంట ఉన్న 51 గ్రామాలను ఓఆర్‌ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో కలుపుతూ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గ్రేటర్ విస్తరణలో భాగమేనని తెలుస్తున్నది.
రెండు భాగాలుగా విభజిస్తే సమాంతర అభివృద్ధికి చాన్స్
రాష్ట్రంలో మొత్తం 158 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఓఆర్‌ఆర్ లోపల 28 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఓఆర్‌ఆర్ కు, ఆర్ఆర్ఆర్కు మధ్య 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి అవతల మొత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. ఢిల్లీలో 2012లో పరిపాలన సౌలభ్యం కోసమని నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ అంటూ మూడు కార్పొరేషన్లుగా విభజించారు. కానీ, వివిధ కారణాలతో 2022లో ఈ మూడు కార్పొరేషన్లను కలిపి మళ్లీ ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది దాదాపు 1,400 చదరపు కిలో మీటర్లుగా ఉన్నది. కాగా, నగరం విస్తరిస్తున్న కొద్దీ, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం, పారిశుధ్య నిర్వహణ వంటి సవాళ్లు ఎదురవుతాయి. అదే సమయంలో విస్తరణ వల్ల సిటీ అభివృద్ధి స్పీడప్ కావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయనే వాదనలూ ఉన్నాయి. హైదరాబాద్‌ను ఢిల్లీతో పోల్చలేమని, అది దేశ క్యాపిటల్ రీజన్ కావడంతో పాటు ఓఆర్‌ఆర్ వరకు ఉన్న హైదరాబాద్‌ను తీసుకుంటే ఢిల్లీ కార్పొరేషన్ తక్కువ చదరపు మీటర్లు ఉన్నదని అధికారులు చెప్తున్నారు. దీంతో కనీసం మహా నగరాన్ని రెండు భాగాలుగా విస్తరిస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్తున్నారు. అప్పుడు రెండింటినీ సమాంతరంగా అభివృద్ధి చేసే వీలుంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతున్నది.