హైదరాబాద్ మెట్రో విస్తరణపై కమిటీ..

హైదరాబాద్ మెట్రో విస్తరణపై  కమిటీ..

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం (అక్టోబర్ 16) మంత్రుల సమావేశంలో.. మెట్రో విస్తరణపై చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  పార్ట్​ 2 ఏ, 2బీ కింద  మెట్రో విస్తరణ జరగాల్సి ఉందని.. ఈ ప్రపోజల్స్​ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కొర్రీలు పెట్టి వెనక్కి పంపిందని తెలిపారు. దీంతో మెట్రో ఫేజ్​ 1ను  కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ టేకోవర్​ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 

మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి సంబంధించి  ఫైనాన్షియల్, టెక్నికల్​ అంశాలతో పాటు కేంద్రం పెట్టిన కొర్రీలు,  రూ.36 వేల కోట్లతో  మెట్రో ఫేజ్​ 2ఏ, 2బీ  విస్తరణ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి సీఎస్​ చైర్మన్​గా కమిటీ వేయాలని కేబినెట్​లో నిర్ణయించినట్లు వెల్లడించారు.

 ఇందులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్​పోర్ట్ అడ్వయిజర్ అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ ఉన్నతాధికారుల కమిటీ తమ రిపోర్టును డిప్యూటీ సీఎం నేతృత్వంలోని రిసోర్స్​ మొబిలైజేషన్​పై ఇప్పటికే ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్లు ఆయన చెప్పారు. 

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్​లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా కేబినెట్​లో చర్చించినట్లు వివరించారు.