Diwali Special : దీపావళి రోజే పెళ్లి చూపులు.. పెళ్లి కూడా.. తెలంగాణలో ఎక్కడంటే..!

Diwali Special :  దీపావళి రోజే పెళ్లి చూపులు.. పెళ్లి కూడా.. తెలంగాణలో ఎక్కడంటే..!

హిందువులకు అనేక ఆచారాలు ఉంటాయి.  ప్రాంతీయ ఆచారాలు.. కుల ఆచారాలు.. కుటుంబ ఆచారాలు  ఇలా ఎవరి సంప్రదాయాల ప్రకారం  వారు పాటిస్తారు.తెలంగాణలో ఆదివాసీలకు ప్రత్యేకమైన ట్రెడిషన్​ ఉంటుంది.  వారికి దీపావళి నాటికి పంట చేతికి వస్తుంది. అంటే వారి చేతి నిండా డబ్బు ఉంటుంది.  ఇంకో ప్రత్యేకమైన ఆచారం ఏంటంటే.. పెళ్లి కావలసిన వారికి అదే రోజు పెళ్లి చూపులు.. ఆతరువాత వెంటనే పెళ్లి కూడా చేస్తారు. దీపావళి రోజు   పెళ్లిచూపులు.. పెళ్లి  ఒకేసారి జరిగే దండారి ఆచారంపై ప్రత్యేక కథనం.. . .

దండారి.. ఆదివాసీలు పంట చేతికొచ్చిన ఆనందంలో చేసుకునే పండుగ. ఈ వేడుకలో పెళ్లీడుకొచ్చిన యువకుల పెళ్లి చూపుల తంతు కూడా జరుగుతుంది. ఒకరికొకరు నచ్చితే వెంటనే పెళ్లి కూడా చేస్తారు. ఉత్సవాల్లో దీపావళి రోజు... ఆదివాసీలు పంట కాపలాకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లే వస్తువులకు కోడిని బలిచ్చి ముల్లె కట్టుకుంటారు.

ఆదివాసీలు పంట చేతికి రాగానే దండారి పండుగ చేసుకుంటారు. ఇది పెళ్లి చూపుల వేదిక లాంటిది. వేడుకలో పిల్లా... పిలగాడు తొలి చూపులు చూసుకుంటారు. నచ్చితే పెద్దలకు చెబుతారు. తర్వాత పెళ్లి చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం నుంచి భాద్రపదం వరకు ఆదివాసీలు సాగు పనుల్లో ఉంటారు.

 దీపావళికి ముందు రోజు మాత్రం అంతా కలిసి లక్ష్మీ దేవి పూజలు చేస్తారు. తెల్లటి దుస్తులు ధరించి పశువులకు నైవేద్యం పెడతారు. ఎడ్ల మెడలకు వాతలు పెడతారు. ఇలా చేస్తే వాటికి రోగాలు రావని సమ్ముతారు.

 ఆచారంలో భాగంగా కొన్నిచోట్ల మనుషుల మెడలకు కూడా వాతలు పెడతారు. వేడుకలో భాగంగా వాళ్లు కాపలాకు ఉపయోగించే వస్తువులకు దీపావళి రోజు పూజలుచేస్తారు. ఆదివాసీలు డప్పు, కత్తి, సన్నాయి, లాఠీలను పంట కాపలాకు వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు. దీపావళి రోజు వాటిని ఒక ముల్లెలో కట్టి దాచుకుంటారు. ముందుగా భీమం చెట్ల కింద దేవుడికి పూజలు చేస్తారు. ఆ తర్వాత తెల్లటి వస్త్రంలో ఆ వస్తువులను ముల్లె కట్టి, కోడి లేదా మేకను బలిస్తారు. పూజ ముగిసిన తర్వాత ఆ ముల్లెను ఇంటికి తీసుకెళ్లి భద్రపరుస్తారు. దాన్ని మళ్లీ ఆషాఢ మాసంలోనే విప్పుతారు.

వారం పాటు ఉపవాసం

పండుగ సందర్భంగా మొక్కులు తీర్చుకోవాలనుకునే యువకులు, పెద్దలు దండారి వేషం కడతారు. ఇలా వేషం కట్టిన వాళ్లంతా గుస్సాడి దుస్తులతో వారం పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. సమీప గ్రామాలు తిరుగుతూ అక్కడ చండారి ఆటలు ఆడుతూ పూజలు చేస్తారు. దీపావళి రోజు దీక్ష విరమిస్తారు

పెళ్లి చూపుల వేదిక

వారం పాటు జరిగే దండారి ఉత్సవాల్లో ఆదివాసీలు తమ పిల్లలకు పెళ్లి చూపులు నిర్వహిస్తారు.పెళ్లి చేసుకోబోయే వధూవరుల వివరాలను ముందుగానే వాళ్లకు చెప్పి పంపిస్తారు. వేడుకల్లో అందరూ ఒక చోట కలిసినప్పుడు వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. నచ్చితే వాళ్ల పెద్దవాళ్లకు చెప్తారు. వాళ్ల తల్లిదండ్రులు వెంటనే పెళ్లి కూడా చేసేస్తారు. సమయానికి పంట అమ్మిన డబ్బు ఉండడంతో ఆదివాసీల ఇళ్లల్లో ఈ సమ యంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి.