
- మంచిర్యాలలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా
- తాళాలు పగులగొట్టి, 120 ఏండ్ల కిందటి ఇండ్లు కూల్చివేత
- ఓ బడా లీడర్ పేరు చెప్పి బెదిరిస్తున్నారంటున్న బాధితుడు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూములే కాకుండా పట్టా ల్యాండ్స్‌కు సైతం ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకుంటున్నారు. చాలాకాలంగా ఖాళీగా ఉన్న భూములతో పాటు ఓనర్లు లోకల్‌గా ఉండని భూములను గుర్తించి వాటిని సాఫ్ చేయడమే కాకుండా కాంపౌండ్ వాల్ కట్టి టెంపరరీ షెడ్లు నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు ఇదేంటని ప్రశ్నిస్తే బడా లీడర్ల పేర్లు చెబుతూ.. బాధితులపైనే కేసులు పెట్టిస్తున్నారు.
పట్టపగలే తాళం పగులగొట్టి...
మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ గర్మిళ్ల శివారు 315/ఆ సర్వే నంబర్‌లో 1954 కాస్రా పహాణీ ప్రకారం ఆకుల నారాయణ పేరున 2.34 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 26-–367, 26--–368 నంబర్లతో 120 సంవత్సరాలుగా రెండు ఇండ్లు సైతం ఉన్నాయి. ఇందులో ఎకరంపావు భూమిని ఆకుల నారాయణ వారసుల వద్ద పూదరి మల్లాగౌడ్ అనే వ్యక్తి తన భార్య కళావతి పేరిట 2007లో కొనుగోలు చేశారు. ఈ మేరకు 7749/2007, 8380/2007 డాక్యుమెంట్ నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే భూమిని 865/2015, 4153/2018 ద్వారా మల్లాగౌడ్ జీపీఏ చేసుకున్నారు. రెండు ఇండ్లను తన పేరిట మార్చుకున్నారు.
తర్వాత మున్సిపాలిటీకి ప్రాపర్టీ, నల్లా ట్యాక్స్, రెండు ఇండ్లకు విద్యుత్ బిల్లులు కడుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్ 8న మధ్యాహ్నం 12.45 గంటల టైంలో ప్రశాంత్‌రావు అనే వ్యక్తితో పాటు మరికొందరు భూమిలోకి చొరబడి, గేట్ తాళాలు పగులగొట్టి జేసీబీతో చదును చేయడం మొదలుపెట్టారు. గమనించిన మల్లాగౌడ్ 100కు కాల్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మంచిర్యాల ఏసీపీ, సీఐలకు వాట్సాప్ మేసేజ్ చేయడంతో పాటు ఫోన్ చేసి విషయం చెప్పారు. అధికారుల సూచన మేరకు అన్ని డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు తీసుకొని సాయంత్రం స్టేషన్‌కు వెళ్లి తన భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఓ జేసీబీ, థార్ వెహికల్స్‌పై కేసు నమోదు చేశారు.
మరునాడు మల్లాగౌడ్‌తో పాటు ప్రశాంత్‌రావును స్టేషన్‌కు పిలిపించి డాక్యుమెంట్లు చూపించాలని అడిగారు. మల్లాగౌడ్ తన డాక్యుమెంట్లు చూపించగా, ప్రశాంత్‌రావు వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మల్లాగౌడ్ ఇచ్చిన డాక్యుమెంట్లను తహసీల్దార్‌కు పంపించారు.
బాధితుడిపైనే కేసు నమోదు
భూ వివాదం ఇలా ఉండగానే... ప్రశాంత్‌రావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు బాధితుడు మల్లాగౌడ్‌పైనే ఉల్టా కేసు పెట్టారు. సర్వేనంబర్ 315/బిలో ఉన్న తన భూమిలోకి గతేడాది నవంబర్ 8న సాయంత్రం 4 గంటలకు మల్లాగౌడ్ వచ్చి తాళాలు పగులగొట్టాడని 9న ప్రశాంత్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రశాంత్‌రావు చెప్పిన గర్మిళ్ల శివారు 315/బి సర్వేనంబర్ అసలు రెవెన్యూ రికార్డుల్లోనే లేదని, తహసీల్దార్ కూడా ధ్రువీకరించారని మల్లాగౌడ్ చెబుతున్నారు.
తహసీల్దార్ డిక్లేర్ చేసినప్పటికీ పోలీసులు తనపై కేసు కొట్టివేయడం లేదని మల్లాగౌడ్ వాపోయారు. 315/ఆ లోని భూమి తనదేనని, అన్ని డాక్యుమెంట్లు పోలీసులకు ఇచ్చినా ఏడు నెలలుగా పెండింగ్ పెడుతున్నారని మల్లాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని రామగుండం సీపీని సైతం కలిశానని చెప్పారు. ప్రశాంత్‌రావు వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా ఆయనకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.