- పార్కింగ్‌కు బదులు షాపులు, గోడౌన్ల ఏర్పాటు
- గుట్టలు గుట్టలుగా స్టాక్ స్టోరేజీ
- ఇరుకు రోడ్లు, సెట్‌బ్యాక్ లేక రెస్క్యూ చేయలేని పరిస్థితి
- వార్నింగులకే అధికారులు పరిమితం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో పార్కింగ్ కోసం ఉపయోగించాల్సిన సెల్లార్లు దుకాణాలుగా, భారీ గోడౌన్లుగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించినా తప్పించుకునే పరిస్థితి లేదు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే స్పాట్ కి వచ్చినా సహాయక చర్యలు అందించే వీలు లేకుండా పోతోంది. ఇరుకు రోడ్లతో, సెట్ బ్యాక్ లేక రక్షించేందుకు అవకాశమే ఉండడం లేదు.
ముఖ్యంగా నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, ఉస్మాన్ గంజ్, ట్రూప్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్, లాడ్ బజార్, షహరాన్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఓనర్లు కక్కుర్తితో ఒక్క అడుగు స్థలాన్ని కూడా వదలకుండా రెంట్‌కు ఇచ్చేస్తున్నారు. దీంతో బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ సామగ్రి లాంటి అత్యంత వేగంగా మంటలంటుకునే వస్తువులను గుట్టలుగా పేర్చి దందా చేస్తున్నారు. షాపుల్లోని మెట్లపై కూడా గ్యాప్ ఉంచడం లేదు. దీంతో ప్రమాదం జరిగి తప్పించుకునే మార్గం లేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇల్లీగల్ గోదాములు
బల్దియా అధికారులు తనిఖీలు చేయకపోవడంతో సెల్లార్లలో వ్యాపారం బహిరంగంగానే జరుగుతోంది. చాలా చోట్ల రెసిడెన్షియల్ పర్మిషన్తీసుకుని కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సెల్లార్లలో ఇల్లీగల్‌గా గోదాములు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ కోసం పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా ఫైర్ సేఫ్టీ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. షాపుల ఓనర్లు గాని, రెంట్‌కు ఉండేవాళ్లు గానీ ఫైర్ సేఫ్టీ అనేది ఒకటి ఉంటుందనే సంగతే మర్చిపోయారు.
ఎక్కడా ఫైర్ ఎగ్జిట్లు ఉండవు. ఉన్న ఒక మెట్ల మార్గం నుంచే పై అంతస్థులకు వెళ్లడం, రావడం చేస్తున్నారు. పైగా ఆ మెట్లపైనే గుట్టలుగా మెటీరియల్ స్టోరేజీ చేస్తున్నారు. స్పేస్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని బిల్డింగులకు సెట్ బ్యాక్ పెట్టడమే మానేస్తున్నారు. భవనానికి, రోడ్డుకు మధ్య ఖాళీ జాగా లేక, రోడ్లు ఇరుకుగా ఉండి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్లూ రాలేని పరిస్థితి. కనీసం అగ్నిమాపక యంత్రాలనూ లోపలకు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేదు. ఈ సమస్య వల్లే గతంలో రెస్క్యూ ఆపరేషన్లు విఫలమై, ప్రాణ, ఆస్తి నష్టం భారీగా పెరిగింది.
వార్నింగులే.. నో యాక్షన్
ఓల్డ్‌సిటీ, నాంపల్లి తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ‘స్ట్రిక్ట్ యాక్షన్తప్పదు..ఇల్లీగల్గోదాముల పని పడతాం..సెల్లార్లలో వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లో సహించం’ అని వార్నింగులు ఇస్తున్న అధికారులునామ్కే వాస్తేగా రెండు మూడు చోట్ల దాడులు చేసి నోటీసులు ఇచ్చి తర్వాత సైలెన్స్ అవుతున్నారు.
హైడ్రా ఏం చేస్తోంది?
హైడ్రా ఏర్పడక ముందు ఫైర్ సేఫ్టీ వ్యవహారాలను బల్దియా చూసుకునేది. హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై యాక్షన్తీసుకోవడంతో పాటు ఫైర్‌సేఫ్టీ పాటిస్తున్నారా లేదా అన్నది చూడాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు. అయితే, ఆన్ లైల్ లో పైర్ సేఫ్టీ అప్లికేషన్లలకు అనుమతి ఇవ్వడమే తప్ప చేస్తున్నదేమీ లేదు. ఎక్కడా ఫీల్డ్ లోకి వెళ్లి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
