- బీఆర్ఎస్ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు: మంత్రి పొంగులేటి
- మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేయాలని పిలుపు
మహబూబాబాద్/మరిపెడ,వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొంత మంది బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం కూలిపోతుందని పగటి కలలు కంటున్నారని.. ఇంకా పదేండ్ల వరకు తమ ప్రభుత్వమే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మరిపెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తొర్రూరు, మరిపెడలో జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. తాను, సీఎం సలహదారుడు వేంనరేందర్ రెడ్డి లాంటి నాయకులున్నంత కాలం కాంగ్రెస్కు ఎలాంటి ముప్పు ఉండదని, ప్రతిపక్షాల నోళ్లకు ముక్కుతాడు వేస్తామన్నారు. బీఆర్ఎస్హయాంలో వరి వేస్తే ఉరే అన్నారని, తాము సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. 26లక్షల మందికి రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, 4.50లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్పారు.
తొర్రూరులో 240 డబుల్ బెడ్ రూమ్ఇండ్లు పేదలకు పంచాలని అధికారులను ఆదేశించారు. తొర్రూరుకు సబ్ రిజిస్ట్రార్ఆఫీసు, ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. పట్టణ పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని పొంగులేటి చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు.
జిల్లాల విభజనలో శాస్త్రీయత లేదు: వేం నరేందర్
పాలకుర్తి నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం మూడు ముక్కలు చేసి, మూడు జిల్లాల పరిధిలో చేర్చిందని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆరోపించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం కమిటీ వేసి వారి నివేదిక ఆధారంగా జిల్లాల విభజన జరుగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ను ప్రజలు మరింత ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిండ్ల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్, తొర్రూరు ఆర్డీవో గణేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
