- వచ్చే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్ల అమలు
- బీజేపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉండవని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: దేశంలో జనాభా గణన ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టదని, రాబోయే 6 నెలల్లోనే ఇది పూర్తవుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. సెన్సస్ అయిపోగానే నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడతామని, ఆ వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల లోపే ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 'సంఘటన్ పర్వ్'లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికను రిటర్నింగ్ ఆఫీసర్‌గా విజయవంతంగా పూర్తి చేసినందుకు.. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అంటే కుటుంబ పార్టీల లెక్క కిచెన్ కేబినెట్‌లో నలుగురు కూసోని నిర్ణయించేది కాదన్నారు.
ఇక్కడ పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని.. అందుకే, ఈసారి జాతీయ అధ్యక్షుడి ఎంపిక కాస్త ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాకే ఎన్నిక నిర్వహించామని, తమ పార్టీలో బూత్ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడయ్యే చాన్స్ ఉందని వెల్లడించారు. 45 ఏండ్ల నితిన్ నబీన్‌కు జాతీయ అధ్యక్షుడిగా అవకాశం దక్కడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావాలంటే కనీసం 12 ఏండ్లు క్రియాశీలక సభ్యత్వం ఉండాలన్నది రూల్ అని లక్ష్మణ్ చెప్పారు.
‘‘అధ్యక్ష ఎన్నికల్లో యూపీ నుంచి ఒకాయన వచ్చి నామినేషన్ వేస్తానంటే.. 12 ఏండ్ల యాక్టివ్ మెంబర్‌షిప్ చూపించమన్నాం. ఆయన చూపించలేకపోయారు. అదే వేరే పార్టీల్లో అయితే, ఎమ్మెల్యేలు సొంత ఖర్చుతో సభ్యత్వాలు చేపిస్తారు. కానీ, బీజేపీలో ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉచితంగా మెంబర్ కావొచ్చు. మూడేండ్లు పనిచేస్తేనే యాక్టివ్ మెంబర్‌షిప్ వస్తది’’ అని వివరించారు.
సామాన్య కార్యకర్తకు అందలం: రాంచందర్ రావు
సామాన్య కార్యకర్త కూడా అంకితభావంతో పనిచేస్తే అత్యున్నత స్థాయికి ఎదిగే ఏకైక పార్టీ బీజేపీ అని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. పార్టీ ఎన్నికల బాధ్యతను లక్ష్మణ్ సమర్థవంతంగా నిర్వహించడం తెలంగాణ శాఖకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్. గౌతమ్ రావు, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.
