వరంగల్, వెలుగు: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. బీఆర్‍ఎస్ అధిష్టానం పెద్దల ఆహ్వానం మేరకు త్వరలో ముఖ్య నేతలు, అనుచరులతో కలిసి మళ్లీ గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ కేఆర్ నాగరాజు చేతిలో ఓడిపోయారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్‍ఎస్ వరంగల్ టికెట్ కోసం ప్రయత్నించారు.
కేసీఆర్ మాత్రం కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ కేటాయించారు. దీంతో అలకబూనిన ఆరూరి రమేశ్ బీజేపీ కండువా కప్పుకొని ఆ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా గట్టి పోటీ ఇచ్చాడు. కమలనాథులు ఎస్సీ సామాజికవర్గం నుంచి తమ పార్టీలో బలమైన నేత ఉన్నాడని భావించగా, పార్టీకి దూరంగానే ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన తిరిగి బీఆర్ఎస్‍లో చేరుతాడనే ప్రచారం జరుగుతోంది.
