భారత్ తో వాణిజ్య చర్చలను ట్రంప్, వాన్స్ అడ్డుకున్నరు.. యూఎస్ సెనేటర్ ఆరోపణ

భారత్ తో వాణిజ్య చర్చలను ట్రంప్, వాన్స్ అడ్డుకున్నరు.. యూఎస్ సెనేటర్ ఆరోపణ
  • టారిఫ్ లతో ఎకానమీ దెబ్బతింటుందని హెచ్చరించినట్లు వెల్లడి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  పాలకవర్గంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్న సంఘటన ఇది. భారత్​తో పాటు ఇతర దేశాలతో టారిఫ్ ల విషయంలో ట్రంప్​తో రిపబ్లికన్  సెనేటర్  టెడ్  క్రజ్ తీవ్రంగా విభేదించిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. భారత్​తో వాణిజ్య చర్చలు, ఇండో అమెరికా అగ్రిమెంట్లను ట్రంప్​తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ సలహాదారు పీటర్  నవారో అడ్డుకున్నారని ఆ ఆడియోలో టెడ్  మండిపడ్డారు. 

2025  ఏప్రిల్​లో కొంతమంది ప్రైవేటు డోనర్లతో టెడ్ మాట్లాడిన ఆడియో అది. ట్రంప్ ఏకపక్ష టారిఫ్ విధానాలను ఆయన ఖండించారు. ఏకపక్ష టారిఫ్ విధానాలతో అమెరికా ఎకానమీ దారుణంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని పేర్కొన్నారు. ‘‘నిరుడు ఏప్రిల్​లో టారిఫ్​లను ప్రకటించిన తర్వాత నేను, కొంతమంది సెనేటర్లం అర్ధరాత్రి ట్రంప్​తో అత్యవసరంగా భేటీ అయ్యాం. టారిఫ్​లపై మరోసారి ఆలోచించాలని ప్రెసిడెంట్​ను కోరాం. అయితే, మేము చేసిన సూచనలు, విజ్ఞప్తులపై ట్రంప్  కస్సుబస్సుమన్నారు. 

మాపై గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో ట్రంప్ మూడ్ సరిగా లేదు. అలాగే, 2026 నవంబర్​లోపు రిటైర్ మెంట్  అకౌంట్లు 30 శాతం తగ్గినా, నిత్యావసర సరుకుల ధరలు 10 నుంచి 20 శాతం పెరిగినా.. రిపబ్లికన్లకు తదుపరి ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదని హెచ్చరించా” అని టెడ్  ఆ ఆడియోలో వ్యాఖ్యానించారు.