తెలంగాణ సాధన కోసం లెఫ్టిస్టులను, రైటిస్టులను ఒక్కటి చేసిన ఘనత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌ది. స్వరాష్ట్ర సాధన కోసం ఆయన ఎక్కని మెట్లు లేవు, తొక్కని గడప లేదు. నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు శ్రమించారు ప్రొఫెసర్ జాదవ్. ఆయన బతికినంత కాలం తెలంగాణనే శ్వాసించారు, స్వప్నించారు.
విద్యార్థిగా ముల్కీ ఉద్యమంలో అరెస్టయి, జీవిత చరమాంకంలో కూడా పోలీసు లాఠీలకు తూటాలకు, చెరసాలలకు వెరవకుండా తెలంగాణ తొలి దశ ఉద్యమం, మలిదశ ఉద్యమాలకు నారుపోసి, నీరుపోసిన వైతాళికుడు. రాంమనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్, బద్రీ విశాల్ పిత్తి వంటి వారితో కలిసి సోషలిస్టు పార్టీని నిర్మించడంలో అగ్రభాగాన నిల్చున్నారు.
సమాజమే కుటుంబంగా...
జనవరి 27, 1933లో హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలంలో శంకర్‌రావు, అమృత దంపతులకు జన్మించిన కేశవరావు జాదవ్ జీవితమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆర్యసమాజ్ కుటుంబంలో జన్మించి సమాజమే కుటుంబంగా నిరంతరం సమసమాజ నిర్మాణం కోసం తపించి, శ్రమించిన స్వార్థరహితుడు ప్రొ. జాదవ్.
ఆయన తన జీవిత కాలంలో 1946–51 వరకు కొనసాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని, 1952 ముల్కీ ఉద్యమాన్ని, 1969 నుంచి సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని, నక్సలైట్ ఉద్యమాన్ని, హక్కుల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా గమనించాడు.
వీటన్నింటిలో ఆయన ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం పొంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారాడు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమిక అందించాడు. అంతర్గత వలస సూత్రీకరణ అనేది మలిదశ ఉద్యమానికి పునాది. ఆ భావవ్యాప్తిలో కేశవరావు జాదవ్‌ది కీలక పాత్ర.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
ఎమర్జెన్సీలో హైదరాబాద్‌లో మొట్టమొదటి అరెస్టు జాదవ్‌దే. 1975 ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలపాటు ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. 2006లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, 2008లో తెలంగాణ జన పరిషత్‌లో కీలకపాత్ర పోషించారు. టు వర్డ్స్ మ్యాన్ కైండ్ (ఇంగ్లిష్), యువ పోరాటం (హిందీ) పత్రికలను నడిపాడు.
'భాషా సమస్య', 'మార్క్స్- గాంధీ- సోషలిజం' (ఇంగ్లిష్), 'లోహియా ఇన్ పార్లమెంట్' పుస్తకాలను వెలువరించారు. నక్సలైట్స్, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతిచర్చలలో కీలక భూమిక పోషించారు. పాలమూరు కరువుకు చలించి గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని తన మార్వాడీ శిష్యుల సహకారంతో గంజి కేంద్రాల ద్వారా పేదల ఆకలి తీర్చారు.
జాదవ్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి
మలిదశ ఉద్యమానికి నాందిగా గౌలీగూడలో సభలు పెట్టించి ఉద్యమానికి ఊతం ఇచ్చారు. పత్రికలు, కరపత్రాల ద్వారా సామ్యవాద సాహిత్యాన్ని ప్రొ. జాదవ్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. తనను తాను ‘మిస్టర్ తెలంగాణ’గా చెప్పుకున్నారు. సోషలిస్టు ఉద్యమం కోసం, తెలంగాణ కోసం, 'హైదరాబాద్ ఏక్తా' కోసం విరామం లేకుండా శ్రమించిన ప్రొ. కేశవరావు జాదవ్ భవిష్యత్ తరాలకు స్పూర్తి. ప్రజల మన్ననలు పొందిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌ను గత ప్రభుత్వం విస్మరించింది.
తెలంగాణలో ఆయన స్మారక చిహ్నాలు నెలకొల్పాలి. కేశవరావు జాదవ్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి. ఆయన జీవితం తెలంగాణ యువతను సదా జాగృతపరిచేలా ఒక పాఠ్యాంశంగా ఉండాలి. జాదవ్ ఎక్కువ కాలం ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలకు జాదవ్ పేరు పెట్టాలి. ఆయన విగ్రహాలు నెలకొల్పాలి. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రొ. కేశవరావు జాదవ్ స్మృతి వనం ఏర్పాటు చేయాలి.
కౌడె సమ్మయ్య, జర్నలిస్ట్
