మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లాలో గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మక్తల్‌టౌన్ లోని తహసీల్దార్ఆఫీసులో సోమవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. తహసీల్దార్సతీశ్ కుమార్ జెండాను ఎగురవేస్తుండగా కర్ర విరిగింది. కింద పడుతుండడంతో వెంటనే అధికారులు, నేతలు చేతులు అడ్డుపెట్టి మంత్రిపై పడకుండా తప్పించారు.
అలా చేయడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. లేదంటే మంత్రి తల మీద పడేది. ఊహించని ఘటనతో పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే సగం విరిగిన కర్రపైనే జెండాను అమర్చి ఎగరవేయించారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మార్కెట్ చైర్మన్ రాధాలక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేశ్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
