ఎస్సైని ఈడ్చుకెళ్లిన యువకులకు రిమాండ్..చర్లపల్లి జైలుకు నిందితులు

ఎస్సైని ఈడ్చుకెళ్లిన యువకులకు రిమాండ్..చర్లపల్లి జైలుకు నిందితులు

ఇబ్రహీంపట్నం, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సైను కారుతో ఢీకొట్టి అలాగే దూసుకెళ్లిన ఇద్దరు యువకులను యాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ రహదారిపై ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తనిఖీల్లో భాగంగా కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎస్సై మధును నిందితులు ఢీకొట్టారు. 

ఎస్సై కారు బానెట్‌‌పై పడినప్పటికీ ఆపకుండా సుమారు 700 మీటర్ల వరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మరో బైక్​ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు ఎస్సై కారు నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు కారణమైన కారును ఇబ్రహీంపట్నంలో పోలీసులు పట్టుకున్నారు. కారులో పరిశీలించగా ఒక మద్యం బాటిల్, ఒక కల్లు బాటిల్ లభ్యమయ్యాయి. 

బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్ కీసరి శ్రీకర్ రెడ్డి(27)కి 135 ఎంజీ, మరో యువకుడు పరంద నితిన్(24)కు 122 ఎంజీ ఆల్కహాల్ పాయింట్లు నమోదయ్యాయి. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.