- ప్రతిపాదనను ఆమోదించనున్న బీకేటీసీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాల్లోకి హిందూయేతరులపై నిషేధం విధించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు పుణ్యక్షేత్రాలతో పాటు బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) పరిధిలోని అన్ని దేవాలయాల్లోకి హిందూయేతరులకు ప్రవేశాన్ని నిషేధించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను త్వరలో జరగనున్న ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఆమోదించనున్నారు.
ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 23న తెరవనున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయాన్ని బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది సమర్థించుకున్నారు. ‘‘ఆలయాలు అనేవి పర్యాటక కేంద్రాలు కాదు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన వేద సంప్రదాయ కేంద్రాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–26 ప్రకారం ప్రతి మతపరమైన సంస్థకు తమ సొంత మత వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు ఉంది.
ఈ నిర్ణయం ఎవరికీ వ్యతిరేకం కాదు. శతాబ్దాల నాటి విశ్వాసం, క్రమశిక్షణ, పవిత్రతను కాపాడటమే మా ఉద్దేశం” అని చెప్పారు. ఈ నిర్ణయం ఏ మతానికి వ్యతిరేకం కాదని, మతపరమైన క్రమశిక్షణకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. సనాతన ధర్మంపై విశ్వాసం ఉన్నవారు ఎవరైనా బద్రీనాథ్, కేథార్ నాథ్ ఆలయాలను సందర్శించవచ్చని చెప్పారు.
