- స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు సీజే, డిప్యూటీ సీఎం భట్టి, పద్మ అవార్డు గ్రహీతలు హాజరు
హైదరాబాద్, వెలుగు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకా నంద, ఎమ్మెల్సీ రమణ, మం డలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, పద్మ భూషణ్ గ్రహీత నోరి దత్తాత్రేయుడు, అవార్డు గ్రహీతలు దీపికా రెడ్డి, విజయ్ ఆనంద్ రెడ్డి, స్వాతంత్ర సమరయోధులు అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు ప్రముఖులను, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా లోక్ భవన్ ప్రాంగణంలో దేశభక్తిని చాటిచెప్పేలా కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖ్యంగా ఈ ఏడాది 150 ఏండ్ల వందేమాతరం థీమ్‌పై సాగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ప్రజాభవన్‌లో మంత్రుల చర్చ..
లోక్ భవన్ లో గవర్నర్ ఎట్‌హోమ్ కార్యక్రమానికి హాజరైన అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానం మేరకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు ప్రజాభవన్‌కు వెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి టీ తాగుతూ వివిధ అంశాలపై 20 నిమిషాల పాటు చర్చించారు. శ్రీధర్‌బాబు ఇటీవల దావోస్ వెళ్లి రావడంతో తన పర్యటన విశేషాలతో పాటు ఇటీవల నైనీ కోల్‌బ్లాక్ టెండర్లపై జరిగిన రచ్చ గురించి ముగ్గురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
కాగా, మంత్రుల భేటీపై సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు రాగా, ఫోన్ లో మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు. ముగ్గురం అనుకోకుండా గవర్నర్ వద్ద కలుసుకున్నామని, అక్కడి నుంచి భట్టి వద్దకు వెళ్లి టీ తాగుతూ క్యాజువల్‌గా మాట్లాడుకున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టంచేశారు.
పలువురికి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు
వివిధ రంగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన పలువురు ప్రముఖులకు, సంస్థలకు “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2025 ’’ను జ్యూరీ కమిటీ ప్రకటించింది. వీరికి సోమవారం రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డులు అందజేశారు. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వాలంటరింగ్ అనే నాలుగు విభాగాల్లో ఎంపికైనవారిని రూ.2 లక్షల చొప్పున నగదుతోపాటు ప్రశంస పత్రాలతో సత్కరించారు.
గత నవంబర్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో స్వీకరించిన నామినేషన్లను ప్రముఖులతో కూడిన జ్యూరీ కమిటీ క్షుణ్నంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య ఆధ్వర్యంలోని జ్యూరీ సభ్యులు ఈ ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు.
మహిళ సాధికారతలో కన్నెగంటి రమాదేవి, గిరిజన అభివృద్ధిలో తోడసం కైలాస్, రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంత్రపీలో డా.ప్రద్యుత్ వాఘ్రే, కార్పొరేట్ వాలంటీరింగ్ వి. రాజన్న అవార్డులు అందుకున్నారు. అంతేగాక పలు సంస్థలకు కూడా అవార్డులు అందజేశారు.మహిళా సాధికారత లో సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ, గిరిజన అభివృద్ధిలో ఇండిజీనియస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంత్రపీలో రామదేవ్‌రావు హాస్పిటల్, కార్పొరేట్ వాలంటీరింగ్ లో గీవ్ ఫర్ సొసైటీలు అవార్డులకు ఎంపికయ్యాయి.
