కర్తవ్యపథ్లో సంబురంగా గణతంత్ర వేడుకలు.. రాజస్థానీ తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ

కర్తవ్యపథ్లో సంబురంగా గణతంత్ర వేడుకలు.. రాజస్థానీ తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
  • గుర్రపు బగ్గీలో చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించిన ప్రెసిడెంట్
  • రాజస్థానీ తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
  • ప్రత్యేక అతిథులుగా ఈయూ నేతలు ఉర్సులా, కోస్టా
  • మూడో వరుసలో రాహుల్, ఖర్గేలకు సీట్ల కేటాయింపు
  • ఢిల్లీ వ్యాప్తంగా 30 వేల మంది పోలీసులతో బందోబస్తు
  • వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
  • ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు.. ప్రత్యేకంగా సందేశం పంపిన ట్రంప్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర దిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకం ఎగురు వేశారు. త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా యురోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లెయెన్,యూరోపియన్ యూనియర్  కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు.

గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము.. ముఖ్య అతిథులతో కలిసి సంప్రదాయ 'రాష్ట్రపతి బగ్గీ'లో కర్తవ్య పథ్​ చేరుకున్నారు. పతాకావిష్కరణ అనంతరం సైనిక వందనం స్వీకరించారు. కర్తవ్యపథ్​లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్​లో తొలిసారి 'బ్యాటిల్ అరే ఫార్మాట్'లో మన సైన్యం ఈ కవాతులో పాల్గొంది.

ఎర్ర కోట నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కవాతులో ఇండోనేసియా సైన్యం కూడా పాల్గొంది. కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్, రెండు మూపురాల ఒంటెలు, జన్స్కార్ గుర్రాలు వంటివి తొలిసారిగా కవాతులో పాల్గొన్నాయి. అంతకుముందు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ నివాళులర్పించారు. గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీవ్యాప్తంగా 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కర్తవ్యపథ్​కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

మూడో వరుసలో ఖర్గే, రాహుల్‌‌
గణతంత్ర దినోత్సవాలకు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే, వీరిద్దరూ మూడో వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. ముందు వరుసలో లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌ఖడ్​కూర్చున్నారు. 

లోక్‌‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలైన రాహుల్‌‌ గాంధీ, ఖర్గేకు మూడో  వరుసలో  సీట్లు కేటాయించడంపై 
ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ప్రతిపక్ష నేతలను అవమానించడమేనని విమర్శించింది. 

రిపబ్లిక్‌‌ డే విషెస్​ చెప్పిన ట్రంప్‌‌ 
 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ట్రంప్ పేరుతో సందేశాన్ని రిలీజ్‌‌ చేశారు. ‘‘77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అమెరికా ప్రజల తరఫున, నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోని అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మన మధ్య బలమైన చారిత్రక బంధం ఉంది” అని సందేశంలో పేర్కొన్నారు. 

కాగా, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ శుభాకాంక్షలు తెలుపుతూ నిరుడు భారత్‌‌ లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో దిగిన సెల్ఫీ ఫొటోను ‘ఎక్స్’ లో పోస్ట్​ చేశారు.

ఈ ఏడాది ప్రత్యేకతలు..
ఈసారి రిపబ్లిక్ డే పరేడ్​లో అనేక అంశాలు తొలిసారి ప్రదర్శనకు వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ ఆర్టిలరీ రెజిమెంట్ బృందాలు తొలిసారి కర్తవ్యపథ్ లో కవాతు నిర్వహించాయి. ఆయా రెజిమెంట్ల బృందాలు తొలిసారి రెండు మూపురాల ఒంటెలు, జంస్కార్ గుర్రాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. 61 క్యావల్రీ(అశ్విక దళం) సభ్యులు  తొలిసారిగా బ్యాటిల్ గేర్ విధానంలో పరేడ్ చేశారు. ఆర్మీ బృందాలు కూడా తొలిసారిగా బ్యాటిల్ అర్రే ఫార్మాట్ లో కవాతు చేశారు. 

అంటే యుద్ధరంగంలో పోరాటానికి సన్నద్ధంగా ఉన్నట్టుగా యూనిఫామ్, ఆయుధాలతో పరేడ్ చేశారు. తొలిసారిగా మిక్స్డ్ స్కౌట్స్ కంటింజెంట్ కూడా ప్రదర్శనలో పాల్గొంది. ఇందులో లడఖ్, డోగ్రా, అరుణాచల్, కుమోన్, గర్హాల్, సిక్కిం స్కౌట్స్ కు చెందిన సభ్యులు పాల్గొన్నారు. అలాగే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ సిస్టమ్, ఇతర కొత్త ఆయుధ వ్యవస్థలను కూడా తొలిసారిగా ప్రదర్శించారు.

ఆకట్టుకున్న తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన 
ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆరంభంలో దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారుల వాయిద్యాలతో ‘వందేమాతర’ గీతాన్ని ఆలపించారు. దీనికి తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గుడోలు కళాకారుడు ఒగ్గు రవి  కళా బృందం  తమ కళను ప్రదర్శించింది.

ఆకట్టుకున్న మోదీ తలపాగా.. ఉర్సులా డ్రెస్సింగ్
ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన రాజస్థానీ సంప్రదాయ తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగులు కలగలిసిన తలపాగాను ధరించారు. ఎరుపు.. అభిరుచి, ఉత్సుకత, ధైర్యసాహసాలకు నిదర్శనంగా చెప్తారు. బంగారు రంగు నెమలి పింఛం ఆకృతులను ఆకట్టుకునేలా డిజైన్​ చేశారు. పట్టు వస్త్రంపై జరీ వర్క్‌‌తో రూపుదిద్దుకున్నది. 

బంగారు రంగు మోటిఫ్‌‌ లతో ఆకర్షణీయంగా కనిపించింది. దీనికి జతగా మోదీ ముదురు నీలం- తెలుపు రంగు కుర్తా -పైజామా, లేత నీలం రంగు హాఫ్ జాకెట్‌‌ను ధరించి.. వేడుకల్లో స్పెషల్​ అట్రాక్షన్‌‌గా నిలిచారు. మరోవైపు, ఉర్సులా.. మెరూన్ రంగులో గోల్డ్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు. ఈ డ్రెస్సింగ్​తో ఆమెలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడింది.

సత్తా చాటిన ‘ఆపరేషన్ సిందూర్’ ప్రదర్శన 
రిపబ్లిక్ డే సందర్భంగా ఆపరేషన్ సిందూర్ థీమ్​తో వాయుసేన అద్భుత విన్యాసాలు నిర్వహిం చింది. రెండు రఫేల్ ఫైటర్ జెట్లు, రెండు మిగ్ 29, రెండు సుఖోయ్ 30 ఎంకేఐలు, ఒక జాగ్వార్ ఫైటర్ జెట్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 

మొత్తంగా 16 యుద్ధ విమానాలు, 4 మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ ప్లేన్లు, 9 హెలికాప్టర్లు కలిపి మొత్తం 29 ఎయిర్ క్రాప్టులు వాయుసేన విన్యాసాల్లో పాల్గొని అబ్బురపర్చాయి. ఆపరేషన్ సిందూర్​లో ఆర్మీ వినియోగించిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆకట్టుకుంది. అలాగే గగనతలంలో యుద్ధ విమానాలు వివిధ ఆకృతుల్లో విన్యాసాలు చేశాయి.

ధ్రువ్ చాపర్ 'సిందూర్' జెండాతో ఎగురుతూ కనిపించింది. 'ఆపరేషన్ సిందూర్' థీమ్​తో రూపొందించిన ఆర్మీ శకటం మరింత ఆకట్టుకుంది. త్రివిధ దళాల కోఆర్డినేషన్ పవర్​ను చాటిచెప్పేలా దీన్ని రూపొందించారు. భారత మిలిటరీ సత్తాను చాటేలా ప్రదర్శించిన బ్రహ్మోస్, ఆకాశ్ మిసైల్స్, ఎంఆర్ శామ్, నాగ్ మిసైల్ సిస్టమ్, ఆర్టిలరీ గన్ సిస్టమ్, ధనుష్ ఆర్టిలరీ గన్, నేవీ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్ సోనిక్ మిసైల్స్, డ్రోన్ల వంటి స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ఆకట్టుకున్నాయి.