
- నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు
- 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుంది
- ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్‌ను ప్రతి రాష్ట్రం డెవలప్ చేస్కోవాలి
- మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే
- సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి
- హాజరుకాని కేరళ, బెంగాల్, పుదుచ్చేరి సీఎంలు
- లెటర్ పంపిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు టీమ్ ఇండియాలాగా కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలా చేస్తే ఇండియాకు అసాధ్యమనేది ఉండదని, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందని చెప్పారు. శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోదీ మాట్లాడారు. పర్యాటకం, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇండియావైపు మొగ్గుతున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు అవరోధాలను తొలగించాలన్నారు. ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇది లోకల్‌గా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన టెర్రరిస్టు దాడి తర్వాత పర్యాటక రంగంపై స్పెషల్ ఫోకస్ కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే మహిళలను ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పారు. మహిళలకు మద్దతు ఇచ్చే చట్టాలు, విధానాలు రూపొందించాలని సూచించారు. ఇది దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలకమని తెలిపారు. సిటీల డెవలప్‌మెంట్‌లో వృద్ధి, ఇన్నొవేషన్స్, స్థిరత్వం ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ భౌగోళిక, జనాభా ప్రయోజనాలను వినియోగించుకోవాలని తెలిపారు. నూతన ఆవిష్కరణలు, మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్రంలోని యువతను తీర్చిదిద్దాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా వారికి నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. మూడు సబ్‌గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అవి జీడీపీ వృద్ధి, జనాభా నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై దృష్టి పెడతాయని చెప్పారు. ఈ సబ్‌గ్రూప్‌లు వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడాన్ని స్పీడప్ చేస్తాయని తెలిపారు.
టీ పార్టీలో సీఎంలతో మోదీ ముచ్చట్లు
సమావేశం తర్వాత నిర్వహించిన టీపార్టీలో మోదీ సీఎంలతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, చంద్రబాబు నాయుడు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, నాగాలాండ్ సీఎం కాన్రాడ్ సంగ్మాతో మోదీ చాయ్ తాగుతూ సరదాగా ముచ్చటించారు.
హాజరవని కొందరు సీఎంలు
ఈ సమావేశానికి కర్నాటక, కేరళ, బెంగాల్, పుదుచ్చేరి సీఎంలు హాజరు కాలేదు. మైసూరులో ముం దస్తు కార్యక్రమం ఉండడం వల్ల కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమావేశానికి హాజరు కాలేకపోయిన ట్లు తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని రాతపూర్వ కంగా సమావేశానికి పంపారు. సమావేశాన్ని బహిష్కరించడం లేదని స్పష్టం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశానికి వెళ్లలేదు. గైర్హాజరవడానికి కారణాలేమీ వెల్లడించలేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. మమతా సొంత రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడుతున్నారని బీజేపీ, రాష్ట్ర సమస్యలను లేవనెత్తే అవకాశాన్ని కోల్పోయారని కాంగ్రెస్ విమర్శించాయి. పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి కూడా సమావేశానికి హాజరు కాలేదు.
2047 నాటికి 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ
గత పదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధించిందని మోదీ అన్నారు. 2014లో 10వ స్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యం ఉందని చెప్పారు. నీతి ఆయోగ్ 2023లో పది రంగాలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఇందులో ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి, స్థిరత్వం, సుపరిపాలన కీలకాంశాలుగా ఉన్నాయి. భారత్‌ను 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని లక్ష్యం.