Mukul Dev: రవితేజ ‘కృష్ణ’ విలన్‌ కన్నుమూత.. 54 ఏళ్ళ వయసులోనే.. ఏమైందంటే?

Mukul Dev: రవితేజ ‘కృష్ణ’ విలన్‌ కన్నుమూత.. 54 ఏళ్ళ వయసులోనే.. ఏమైందంటే?

రవితేజ కృష్ణ మూవీలో విలన్‌గా నటించిన నటుడు ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) మృతి చెందారు. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ముకుల్‌ దేవ్‌ 54 ఏళ్ల వయసులోనే మరణించారు.

శుక్రవారం (2025మే23న) రాత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే, కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు పలు నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ముకుల్ మరణ వార్తను అతని స్నేహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ముకుల్ దేవ్‌తో ఉన్న పాత ఫోటోను షేర్ చేసి, "ఇది నమ్మలేకపోతున్నాను. రిప్" అని రాశారు. ఇకపోతే ముకుల్ మరణానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు. అతని కుటుంబం లేదా సన్నిహితుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

తెలుగులో ప్ర‌భాస్ న‌టించిన ఎక్ నిరంజ‌న్ సినిమాతో పాటు ర‌వితేజ కృష్ణ సినిమాలో విలన్ గా నటించి శభాష్ అనిపించుకున్నాడు. కేడీ, అదుర్స్ వంటి చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ మూవీలో ముకుల్ కనిపించాడు. సింహాద్రి, సీతయ్య, అతడు వంటి సినిమాలతో విలన్ గా సెటిల్ అయిన నటుడు రాహుల్‌ దేవ్‌ సోదరుడే ముకుల్‌. 

ముకుల్ సినీ ప్రస్థానం:

1996లో ‘ముమ్‌కిన్’ అనే టీవీ సీరియల్ తో మొదలైంది. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే 'ఏక్ సే బద్ కర్ ఏక్' అనే కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షోలో కూడా నటించాడు. 1996లో 'దస్తక్'తో సుష్మితా సేన్‌తో కలిసి ఎసిపి రోహిత్ మల్హోత్రాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

'కిలా' (1998), 'వాజూద్' (1998), 'కోహ్రామ్' (1999) మరియు 'ముఝే మేరీ బివి సే బచావో' (2001) వంటి అనేక హిందీ సినిమాలలో నటించాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, బెంగాలీ, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి ముకుల్ తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తి చేస్తుంది.

ముకుల్ దేవ్ తెలుగు మూవీస్:

ముకుల్ దేవ్ రవితేజ కృష్ణ సినిమాతోపాటు నిప్పు, జగపతి బాబు సిద్ధం, ఏక్ నిరంజన్, అదుర్స్, జేడీ చక్రవర్తి మనీ మనీ మోర్ మనీ, నాగార్జున భాయ్, తనీష్ దేశదిమ్మరి, నేనే కేడీ నెం 1 వంటి సినిమాలలో నటించారు.