రఘునాథపల్లి/ స్టేషన్ ఘనపూర్, వెలుగు: దేశానికైనా, రాష్ట్రానికైనా ఒక్కరే జాతిపిత ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును జాతిపితగా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. గురువారం జఫర్‌గడ్ తహసీల్దార్ ఆఫీస్, స్టేషన్ ఘనపూర్ రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. జఫర్‌గడ్ మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ.15,01,740 విలువైన చెక్కులు, స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన 28 మందికి రూ.28,03,248 విలువైన చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని కుటుంబ హక్కుగా భావిస్తూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో అసభ్య విమర్శలు చేయడం వల్లే ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు 2014కు ముందు, తర్వాత వారి ఆస్తుల వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు హనుమకొండలోని ఆయన నివాసంలో రఘునాథపల్లి మండలం కోడూర్గ్రామానికి చెందిన కుర్మ కులస్తులు ఎమ్మెల్యేను కలిశారు. గ్రామంలోని బీరప్ప ఆలయానికి రోడ్డు మంజూరు చేయాలని వారు వినతిపత్రం అందజేశారు.
