కాగజ్ నగర్ వెలుగు: చింతల మానేపల్లి మండలం రణవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి జాడి దర్శన మామ బాపును గుర్తుతెలియని వ్యక్తి దళం పేరుతో లేఖ ఇచ్చి, తుపాకీతో బెదిరించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబంతో మాట్లాడారు. ఘటన జరిగిన తీరు, నిందితుడి ఆనవాళ్లను అడిగి తెలుసుకున్నారు.
భయపడొద్దని బాపుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీలు, సెల్ సిగ్నల్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
