
న్యూఢిల్లీ: డోప్ టెస్టులో దొరికిన సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ రీఎంట్రీకి అర్హత సాధించాడు. అతనిపై విధించిన తాత్కాలిక బ్యాన్ ఎత్తివేశారు. నిషేధిత రిక్రియేషనల్ (వినోద) డ్రగ్ వాడిన కారణంగా ఒక నెల సస్పెన్షన్ ఎదుర్కొన్న రబాడ ఈ టైమ్‌లో ‘సబ్‌స్టాన్స్ అబ్యూజ్ ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్’ పూర్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌతాఫ్రికా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రగ్-ఫ్రీ స్పోర్ట్ (ఎస్‌ఏఐడీఎస్) ప్రకటించింది. దీంతో అతను ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ తరపున మళ్లీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చిన కగిసో ఇప్పటికే గుజరాత్ జట్టుతో కలిశాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే చాన్సుంది.
రబాడ జనవరిలో జరిగిన ఎస్‌ఏ20 లీగ్‌లో డ్రగ్ టెస్ట్‌లో ఫెయిలయ్యాడు. ఏప్రిల్ 1 నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. సౌతాఫ్రికా యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం అతను ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొని రెండు సెషన్‌లను పూర్తి చేశాడు. దీంతో తనపై బ్యాన్ ఒక్క నెలకే పరిమితమైంది. ఈ సస్పెన్షన్ ఎత్తివేతతో రబాడ వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ల్లోనూ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. 30 ఏండ్ల రబాడ గత నెలలో గుజరాత్ టైటాన్స్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడి వ్యక్తిగత కారణాలతో లీగ్ నుండి తప్పుకున్నాడు. కానీ, డోప్ టెస్టులో దొరికిన కారణంగానే తప్పుకున్నానని తర్వాత వెల్లడించాడు.