కాకా క్రికెట్ టోర్నీ విన్నర్ రామగుండం

కాకా క్రికెట్ టోర్నీ విన్నర్ రామగుండం
  •    ఫైనల్​లో చెన్నూరుపై గెలుపు 
  •     విజేతకు ట్రోఫీ, రూ.3 లక్షల ప్రైజ్‌మనీ
  •     రన్నరప్ కు రూ.2 లక్షలు
  •     బహుమతులు అందజేసిన మంత్రులు పొంగులేటి, పొన్నం 

కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్‌‌లో రామగుండం జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో రామగుండం నాలుగు వికెట్ల తేడాతో చెన్నూరు జట్టుపై విజయం సాధించింది. బహుమతుల ప్రదానోత్సవానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.  విజేత రామగుండం జట్టుకు ట్రోఫీతో పాటు రూ.3 లక్షల ప్రైజ్ మనీ.. చెన్నూరు జట్టుకు రూ. 2 లక్షలు, రన్నరప్ ట్రోఫీ అందజేశారు.

హైదరాబాద్, వెలుగు:  కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్‌లో రామగుండం జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో రామగుండం నాలుగు వికెట్ల తేడాతో చెన్నూరు జట్టుపై విజయం సాధించింది. టాస్  గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నూరు 84 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రామగుండం ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ ​అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేత రామగుండం జట్టుకు ట్రోఫీతో పాటు రూ.3 లక్షల ప్రైజ్ మనీ.. చెన్నూరు జట్టుకు రూ.2 లక్షలు, రన్నరప్ ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ టోర్నీలో 45 జట్లు పాల్గొన్నాయి. 

క్రికెట్‌తో గడ్డం కుటుంబానిది ఫెవికాల్ బంధం: పొంగులేటి

క్రికెట్‌పై దివంగత కాకా వెంకటస్వామికి, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్‌, యువ నాయకుడు వంశీకృష్ణకు ఎంతో ప్రేమ ఉందని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్రికెట్‌తో గడ్డం కుటుంబానిది ఫెవికాల్ బంధం అని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనలో వివేక్ వెంకటస్వామి క్రియాశీలకంగా పనిచేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాకా లాంటి ఉద్ధండులను చూసి తాను రాజకీయాలు నేర్చుకున్నానని చెప్పారు.  

కాకా కృషి వల్లే ఇండియాలో వరల్డ్ కప్‌: వివేక్‌ 

గ్రామీణ ప్రాంత యువతలో క్రికెట్ ప్రతిభను వెలికితేసేందుకే కాకా టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ‘‘దేశంలో క్రికెట్​కు ట్యాక్స్ మినహాయింపు తీసుకొచ్చింది కాకానే. ఆయన కృషి వల్లే ఇండియాలో వరల్డ్ కప్ కూడా జరిగింది. -నేను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాకా పేరు మీద ఐపీఎల్‌ మాదిరిగా  తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్‌) నిర్వహించాను. టీపీఎల్ వల్ల తిలక్ వర్మ ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. మరికొంత మంది టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. వచ్చే నవంబర్ లో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా టోర్నమెంట్ నిర్వహిస్తాం” అని వివేక్ వెల్లడించారు. 

జిల్లాకో క్రికెట్ స్టేడియం ఉండాలి: వినోద్​ 

రాష్ట్రంలో జిల్లాకో క్రికెట్‌ స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఉందని బెల్లంపలి ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చొరవ తీసుకోవాలని కోరారు. ‘‘ఎల్బీ స్టేడియంతో నాకు విడదీయరాని బంధం ఉంది. నేను,  తమ్ముడు వివేక్ ఫస్ట్ టైమ్ మ్యాచ్ ఇక్కడే చూశాం. మేమిద్దరం క్రికెట్ నేర్చుకుంది కూడా ఇక్కడే. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు మరిన్ని టోర్నమెంట్ లు నిర్వహిస్తాం” అని వినోద్ చెప్పారు. 

ఏటా కాకా టోర్నమెంట్: గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి నుంచి ఓ ఆటగాడు ఇండియాకు ఆడితే బాగుంటుందని, ఆ దిశగా యువకులను ప్రోత్సహించేందుకే ఈ టోర్నీ నిర్వహించామని కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇకపై ఏటా రాష్ట్రవ్యాప్తంగా కాకా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.