- వరంగల్‌పై నిజామాబాద్, మహబూబ్‌నగర్‌పై రంగారెడ్డి గెలుపు
గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కొనసాగుతున్న కాకా మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీలోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన రెండు రోజుల పోటీలు సోమవారం ముగిసాయి. రెండో రోజు పోటీలను ఐఎన్టీయూసీ నేషనల్ సీనియర్ సెక్రెటరీ, ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అండగా నిలుస్తున్నారని, ఇందులోభాగంగానే ఐపీఎల్‌ను తలపించేలా అన్ని జిల్లాల్లో కాకా మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం ఉదయం నిజామాబాద్, వరంగల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
మెదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వరంగల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులకే పరిమితమైంది. 65 పరుగులు చేసి 9 వికెట్లు తీసిన సాయి ప్రతీక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మధ్యాహ్నం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జట్లు తలపడ్డాయి.
ముందుగా బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి జట్టు 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది.
32 బంతుల్లో 4 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రంగారెడ్డి క్రీడాకారుడు పెద్ది సాత్విక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ డీజీఎం జితేందర్ కుమార్, ఆఫీసర్లు ప్రజ్ఞ, ఆయుషా, లీడర్లు భూమల్ల చందర్, జావెద్, సీనియర్ క్రికెటర్లు కిరణ్, సుధేశ్ పాల్గొన్నారు.
