- పరుగుల వరద.. వికెట్ల వేట
హనుమకొండ/ ములుగు, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ 20 లీగ్ రెండో రోజు గురువారం ఉత్సాహంగా కొనసాగింది. వరంగల్ జిల్లా మొగిలిచెర్ల, ములుగు జిల్లా జాకారం, జనగామ జిల్లా వంగాలపల్లి గ్రౌండ్లలో జరిగిన మ్యాచుల్లో క్రీడాకారులు పరుగుల వరద సృష్టించగా, బౌలర్లు వికెట్ల వేట కొనసాగించారు.
వరంగల్ జిల్లా మొగిలిచెర్లలో రెండో రోజు మ్యాచ్ ల ప్రారంభ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను వారు బ్యాటింగ్ చేసి క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిచేందుకు కాకా వెంకటస్వామి కుటుంబం కృషి చేస్తోందన్నారు. చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకకాలంలో మూడు చోట్ల మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట రాము, జాయింట్ సెక్రటరీ బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
