తిమ్మాపూర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కాకా వెంకటస్వామి మెమోరియల్ ఫేజ్ –2 తెలంగాణ అంతర్ జిల్లా టీ-–20 లీగ్ పోటీలు రెండోరోజు శనివారం హోరాహోరీగా జరిగాయి. అలుగునూరులోని వెలిచాల జగపతిరావు మెమోరియల్గ్రౌండ్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉదయం వరంగల్, నల్గొండ జిల్లా జట్లు తలపడ్డాయి.
టాస్ గెలిచిన వరంగల్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ 36, రాహుల్ 33, చంద్ర 30, ఆరుష్ 26 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ జట్టులో జ్ఞానప్రకాశ్ 8 ఫోర్లు 4 సిక్సర్లతో 85, సాయినాథ్ 27 పరుగులు చేశారు. జ్ఞాన ప్రకాశ్‌కు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్‌బాబు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్అవార్డు అందజేశారు.
రెండో మ్యాచ్‌లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఖమ్మం జట్టు విజయం
మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో ఖమ్మం,- మహబూబ్‌నగర్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఖమ్మం జట్టు బ్యాటింగ్ దిగి, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఈ జట్టులో శివ 32 పరుగులు చేశాడు. మహబూబ్‌నగర్ జట్టు బౌలర్ హరీశ్4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ జట్టు 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఖమ్మం జట్టు10 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఖమ్మం జట్టులో నాయుడు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కేడీసీఏ అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, కోశాధికారి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్ తదితరులున్నారు.
