రెండో రోజు ఉత్కంఠగా కాకా టోర్నమెంట్..సెంచరీ కొట్టి సత్తా చాటిన నల్గొండ బ్యాట్ మెన్ ఆది మణికిరణ్

రెండో రోజు ఉత్కంఠగా కాకా టోర్నమెంట్..సెంచరీ కొట్టి సత్తా చాటిన నల్గొండ బ్యాట్ మెన్ ఆది మణికిరణ్

నల్గొండ, వెలుగు: కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు హోరాహోరీ పోటీ నెలకొంది. బుధవారం ఉదయం యాదాద్రి సూర్యాపేట జిల్లాల మధ్య మ్యాచ్ నిర్వహించగా యాదాద్రి జిల్లా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.  20 ఓవర్లలో యాదాద్రి జట్టు 7  వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.  యాదాద్రి జిల్లా జట్టులో మహ్మద్ సిఖందర్ 37 బంతుల్లో 40 పరుగులు చేయగా లక్ష్మీ కాంత్ గౌడ్ 32 బంతుల్లో 32 పరుగులు చేశారు. 

158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్యాపేట జిల్లా జట్టు 118 పరుగులకే ఆలౌట్ అయి 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. సూర్యాపేట జట్టులో నిఖిల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండవ మ్యాచ్ లో నల్గొండ, యాదాద్రి జిల్లా జట్లు తలపడగా నల్గొండ జట్టు భారీ స్కోర్ చేసి గెలుపొందింది.  నల్గొండ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగా 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.  నల్గొండ జట్టులో ఆది మణికిరణ్ 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 బంతుల్లోనే 108 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. 

మనీష్ 23 బంతుల్లో 46 పరుగులు, జ్ఞాన ప్రకాశ్ 22 బంతుల్లో 43 పరుగులు, సైంధవ్ 8 బంతుల్లోనే 30 పరుగులు చేశారు. నల్గొండ జట్టు బ్యాటర్ల దెబ్బకి యాదాద్రి జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంది.  245 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన యాదాద్రి జట్టు చివరి వరకు గెలుపు కోసం పోరాడినా ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. యాదాద్రి జట్టులో రోహిత్ 47 బంతుల్లో 92 పరుగులు చేయగా 9 సిక్సులు బాదాడు.