కాకా.. పేదల గొంతుక హౌసింగ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కు దారిచూపారు: వివేక్

కాకా.. పేదల గొంతుక హౌసింగ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కు దారిచూపారు: వివేక్
  • బడుగు వర్గాల కోసం పోరాడారు: పొన్నం  
  • హౌసింగ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు దారిచూపారు: వివేక్ 
  • రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకా జయంతి వేడుకలు 

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో ఎంతో మంది ఉన్నా కొంతమంది మాత్రమే చిరస్మరణీయంగా నిలిచిపోతారని, అలాంటి వ్యక్తుల్లో కాకా వెంకటస్వామి ఒకరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కార్మిక నాయకుడి నుంచి రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా.. ఇలా ఏ పదవి చేపట్టిన దానికి వన్నె తెచ్చారని కొనియాడారు. కాకా దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 96వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కాకా బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మిక చట్టాల్లో సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. “చొక్కారావు లాంటి వారితో సమకాలీన రాజకీయ నాయకులు కాకా. నేటి తరం నాయకులు వాళ్లను చూసి ఎంతో నేర్చుకోవాలి. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కాకా పోరాడారు. ఉద్యమ సమయంలో వివేక్‌‌‌‌కు, నాకు ఆయన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఎప్పుడూ తెలంగాణ కోసం తపిస్తూ ఉండేవారు. తెలంగాణ వచ్చే వరకూ తనకు మరణం లేదని ఎన్నోసార్లు చెప్పారు” అని పేర్కొన్నారు. కాకా కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. 

కాకా కుమారులు, మనుమడు ఇప్పుడు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ కోరుట్ల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ జువ్వాడి నర్సింగ రావు, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, ఆరేపల్లి మోహన్, సింగరేణి కార్మిక నేత వెంకట్రావ్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.  కాగా, ఈ సందర్భంగా అంబేద్కర్ కాలేజీ జర్నల్‌‌‌‌ను మంత్రులు విడుదల చేశారు. అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేకానంద్, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు. 

గుడిసెలు, ఇండ్ల పట్టాలు ఇప్పించారు: వివేక్ 

కాకా వెంకటస్వామి కేంద్రమంత్రిగా కార్మిక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన కుమారుడు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘కాకా 1970లోనే హైదరాబాద్‌‌‌‌లో 75 వేల మందికి గుడిసెలు ఇప్పించారు. రామగుండంలో 30 వేల మంది సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇప్పించారు. పేదలకు గుడిసెలు, ఇండ్ల పట్టాలు ఇప్పించి దేశంలో హౌసింగ్ స్కీమ్‌‌‌‌కు దారి చూపించారు” అని పేర్కొన్నారు. “నాన్న కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నేను సీఐఐ ప్రెసిడెంట్‌‌‌‌గా ఉన్నాను. ఆ టైమ్‌‌‌‌లో ప్రైవేట్ కంపెనీల యాజమానులు వచ్చి.. ‘మీ నాన్న కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అవి మాకు ఇబ్బందిగా ఉన్నాయి. మీ నాన్నతో ఒకసారి మాట్లాడండి’ అని నన్ను కోరారు. ఇదే విషయాన్ని నేను నాన్నకు చెబితే.. ‘గెట్ అవుట్’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కార్మికులపై నాన్నకు ఉన్న అభిమానం” అని చెప్పారు. సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, కాకా ఆనాడు కేంద్రం నుంచి రూ.400 కోట్లు ఇప్పించి సంస్థను కాపాడారని గుర్తు చేశారు. ప్రజల కోసం కాకా ఎంతో చేశారని, ఆయన ఆశయాలను తమ కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నదని తెలిపారు.  

కాకా.. గొప్ప నేత: జూపల్లి  

పేద కుటుంబంలో పుట్టి కేంద్రమంత్రి వరకు ఎదిగిన కాకా వెంకటస్వామి గొప్ప నేత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని చెప్పారు. ‘‘40 ఏండ్ల కింద కాకాను కలిశాను. ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఇందిరాగాంధీకి కాకా అత్యంత సన్నిహితుడు. అదే సాన్నిహిత్యం రాజీవ్ గాంధీతోనూ కొనసాగించారు. కాకా తెలంగాణ కోసం ఎంతో తపన పడ్డారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ర్ట ఆవశ్యకతను  సోనియాగాంధీ దగ్గర బలంగా వినిపించారు” అని పేర్కొన్నారు. ఆ రోజుల్లో లక్షలాది మంది పేదలకు ఇండ్ల పట్టాలు, గుడిసెలు ఇప్పించారని గుర్తు చేశారు. 

ఆ సంస్కరణలే పెద్ద విజయాలు: వినోద్ 

కాకా వెంకటస్వామి తీసుకొచ్చిన సంస్కరణలే పెద్ద విజయాలని ఆయన కుమారుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ‘‘కాకాకు కాంగ్రెస్‌‌‌‌పై ఎంతో అభిమానం ఉంది. అందుకే ఢిల్లీలోని ఇంటిని పార్టీ ఆఫీసుకు ఇచ్చారు. ఈ రోజు నేను, వివేక్, వంశీ రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నామంటే.. దానికి కాకా చేసిన కృషే కారణం. రాజకీయాల్లో ఓపిక ఉండాలని, కష్టపడితే ప్రతిఫలం వస్తుందని నాన్న నుంచి నేర్చుకున్నాను” అని పేర్కొన్నారు.

కాకా మనుమడనినాకెంతో గౌరవం ఇస్తున్నారు: ఎంపీ వంశీకృష్ణ 

కాకా వెంకటస్వామి జయంతి అంటే తనకు ఎంతో ఎమోషనల్ అని ఆయన మనుమడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ‘‘2010లో నా చదువు పూర్తయినప్పటి నుంచి 2014 వర కు కాకా దగ్గర ఉండి ఎన్నో విషయాలు నేర్చు కున్నాను. నేను ఎంపీగా పోటీ చేసిన సమ యంలో పెద్దపల్లి నియోజకవర్గమంతా కాకా ను గుర్తుచేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో, పార్లమెంట్‌‌‌‌లో కాకా మనుమడిని అని చెప్పి ఎవర్ని పరిచయం చేసుకున్నా.. ఎంతో గౌరవం, మర్యాద ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా సమస్యలపై నేను ఇస్తున్న వినతిపత్రాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు” అని చెప్పారు.