
- 387 పీహెచ్డీ పట్టాలిచ్చిన గవర్నర్
- 564 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం
హనుమకొండ/ హసన్ పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో 23వ కాన్వొకేషన్ పండుగలా జరిగింది. వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన వర్సిటీ ఆడిటోరియంలో సోమవారం ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పట్టాలు పొందినవారితో క్యాంపస్ కళకళలాడింది. దాదాపు మూడేండ్ల తరువాత జరుగుతున్న కాన్వొకేషన్ కు రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్ లర్ జిష్ణుదేవ్ వర్మ, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, ఐఐసీటీ డైరెక్టర్ డా.డి.శ్రీనివాస్ రెడ్డి చీఫ్ గెస్టులుగా వచ్చారు.
గవర్నర్ జిష్ణుదేవ్‌శర్మకు వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం, అధికారులు ఘన స్వాగతం పలికారు. యూనివర్సిటీ గోల్డన్ జూబ్లీ ఇయర్లో జరుగుతున్న ఈ వేడుక ఎంతో విశేషమైందని వీసీ ప్రతాప్ రెడ్డి అన్నారు. వర్సిటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.144 కోట్ల బ్లాక్ గ్రాంట్, రూ.50 కోట్ల అదనపు గ్రాంట్ ఇచ్చిందని, ఈ ఫండ్స్‌తో యూనివర్సిటీ మౌలిక వసతులు మెరుగవుతాయని చెప్పారు. వర్సిటీలో గోల్డెన్ జూబ్లీ అకడమిక్ కాంప్లెక్స్, పీవీ నరసింహరావు పరిశోధన, విజ్ఞాన కేంద్రం, వేయి మందికి వసతి కల్పించేలా గర్ల్స్ హాస్టల్, ఆర్ట్స్ కాలేజీ లో సెంటినరీ బ్లాక్ కోసం ప్రభుత్వానికి ప్రాజెక్ట్రిపోర్ట్ పంపినట్టు తెలిపారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో ప్రసంగించారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, మాజీ వీసీలు ప్రొ.ఎన్.లింగమూర్తి, ప్రొ.బి.వెంకటరత్నం. అకడమిక్ సెనెట్ సభ్యులు అంపశయ్య నవీన్, మాణిక్యం, గొల్లపూడి జగదీశ్, ఈసీ మెంబర్స్ ప్రొ.బి. సురేశ్ లాల్, డాక్టర్ బి.రమ, డాక్టర్ చిర్ర రాజు, డా.కె.అనితారెడ్డి, పుల్లూరు సుధాకర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
నిట్ లో గవర్నర్ కు గ్రాండ్ వెల్ కం
కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వరంగల్ కు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీశ్, డా. సత్య శారద, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబూది గ్రాండ్ వెల్ కం చెప్పారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట రెడ్డి తదితరులు బొకేలు, పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు గౌరవ వందనం సమర్పించారు.
స్టూడెంట్ లీడర్ల ముందస్తు అరెస్ట్
కేయూ భూములను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు కేటాయించడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో గవర్నర్ పర్యటన సందర్భంగా వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో డీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డీఎస్, ఎస్ఎస్యూ, పీడీఎస్ యూ, డీఎస్ యూ, బీఎస్ఎఫ్ నేతలు శ్రావణ్, గణేశ్, వీరస్వామి, శ్రీకాంత్, జశ్వంత్, సాయి, నాగార్జున, సాయికుమార్, మహేశ్, మధూకర్, అన్నమయ్య, శివకుమార్ ఉన్నారు.
387 పీహెచ్డీలు, 564 గోల్డ్ మెడల్స్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వీసీ ప్రతాప్ రెడ్డి స్టూడెంట్లకు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. వివిధ డిపార్ట్మెంట్లలో 2020 నుంచి 2025 వరకు రిసెర్చ్ పూర్తి చేసిన 387 మందికి పీహెచ్డీలు, 2015 నుంచి 2021 వరకు వివిధ కోర్సుల్లో ప్రతిభ చాటిన 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ అందజేశారు.