కుడా మార్క్..కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ చేతికి ఓరుగల్లు మెగా ప్రాజెక్టులు

కుడా మార్క్..కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ చేతికి ఓరుగల్లు మెగా ప్రాజెక్టులు
  • 5 జిల్లాల పరిధి అభివృద్ధిలో మేజర్‍ రోల్‍  
  • ఏడాదిలో పట్టాలెక్కిన రూ.584 కోట్లకుపైగా విలువైన పనులు
  • వరంగల్‍ టూరిజం, గ్రేటర్‍ అభివృద్ధిలో కీలకంగా కుడా నిధులు

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లు అభివృద్ధిలో ‘కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ’ (కుడా) కీలకంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‍ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన కుడా పాలకవర్గం మొదటి ఏడాది కాలంలో ఏకంగా రూ.584 కోట్లకు పైగా విలువైన పనులను పట్టాలెక్కించింది. ప్రభుత్వం తరఫున కుడా లేఔట్లతో పాటు ఎల్‍ఆర్‍ఎస్‍  రూపంలో వచ్చిన నిధులను పలు మేజర్‍ ప్రాజెక్టులకు వినియోగిస్తోంది. 

గత ప్రభుత్వంలో ప్రపొజల్స్​తో ఆగిన పనులతో పాటు 'వరంగల్‍ మాస్టర్‍ ప్లాన్‍_2041' అమలులో భాగంగా సరికొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. ప్రధానంగా వరంగల్‍ నగర రూపురేఖలు మారడానికి అవసరమయ్యే రింగురోడ్లు, జంక్షన్ల బ్యూటిఫికేషన్‍, వారసత్వ కట్టడాలు, పార్కులతో పాటు చెరువుల అందంగా తీర్చిదిద్దుతోంది. 

5 జిల్లాల పరిధిలో సేవలు..

కుడా ప్రధానంగా వరంగల్‍, హనుమకొండ, జనగామ జిల్లాలతో పాటు భూపాలపల్లి, సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాలతో కలిపి 5 జిల్లాల పరిధిలో ఉంది. 181 రెవెన్యూ గ్రామాలు, 1,805 స్వేర్‍ కిలోమీటర్ల ఏరియాలో సేవలు అందిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 13 లక్షల జనాభా కుడా పరిధిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‍ గవర్నమెంట్‍ వచ్చాక కుడా ఆధ్వర్యంలో ఏడాదిలోనే రూ.584 కోట్ల పనులు చేపట్టగా, అందులో మేజర్‍గా పూర్తయ్యాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.  

రూ.352 కోట్లతో రింగ్‍ రోడ్‍, కాళోజీ కళాక్షేత్రం..

గ్రేటర్ వరంగల్‍ అభివృద్ధిలో భాగమైన రింగ్‍రోడ్ల నిర్మాణంలో కుడా నిధులే ప్రధానంగా ఉన్నాయి. 2010లో ఐఆర్‍ఆర్‍ కోసం అడుగులు పడగా ములుగు జిల్లా వైపు ఆరెపల్లి దామెర జంక్షన్‍ వరకు మాత్రమే రోడ్డు వచ్చింది. అక్కడి నుంచి కొత్తపేట, పైడిపల్లి, ఏనుమాముల, జానీపీరీలు మీదుగా నాయుడు పెట్రోల్‍ పంపు వరకు నిర్మించాల్సి ఉండగా, అవసరమయ్యే 60 నుంచి 70 ఎకరాల భూసేకరణలో  బీఆర్‍ఎస్‍ సర్కార్‍ ఫెయిల్‍ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‍రెడ్డి కుడా అధికారులకు ఐఆర్‍ఆర్‍ పనులను క్లియర్‍ చేయాలని ఆదేశాలిచ్చారు. 

దీంతో అప్పటివరకు రైతులకు చెల్లించాల్సిన రూ.107 కోట్ల నిధులను 'కుడా' తరఫున చెల్లించారు. నగరంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో గత ప్రభుత్వం 2014లో మొదలుపెట్టి పనులను సాగదీసిన కాళోజీ కళాక్షేత్రం పనులను కాంగ్రెస్‍ సర్కారు రాగానే కుడా తరఫున రూ.95 కోట్లను కేటాయించి పెండింగ్​ పనులు పూర్తి చేయించారు. కుడా ఈ రెండు ప్రాజెక్టుల కోసమే రూ.202 కోట్లు మంజూరు చేసింది. ఇవేగాక మరో రూ.150 కోట్లతో వరంగల్‍ సిటీ చుట్టూరా 13 కిలోమీటర్ల ఐఆర్‍ఆర్‍ పరిధిలో రైల్వే శాఖతో కలిసి ఓవర్‍ బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు నడుస్తున్నాయి.

రూ.110 కోట్లతో టెంపుల్‍ టూరిజం..

స్మార్ట్​ సిటీ, కుడా తరఫున గతంలో భద్రకాళి బండ్‍ అభివృద్ధి చేయగా, రెండో దశలో కుడా భద్రకాళి టెంపుల్‍ సర్క్యూట్‍గా కిలోమీటర్ దూరంలో ఐదారు టూరిజం స్పాట్లు ఉండేలా పనులు చేపట్టింది. మొదటి దశలోనే రూ.110 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టగా, భద్రకాళి ఆలయానికి మాడవీధులు, నాలుగు వైపులా రాజగోపురాల నిర్మాణాలకు రూ.30 కోట్లు కేటాయించారు. మరో రూ.10 కోట్లతో వేద పాఠశాల, ఇతర పనులు చేపట్టనున్నారు. భద్రకాళి చెరువు పూడికతీత, 9 చోట్ల ఐలాండ్స్​ ఏర్పాటుకు రూ.10 కోట్లతో పనులు చేపట్టగా, మరో రూ.60 కోట్లతో చెరువుపై రోప్‍ వే, గ్లాస్‍ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. రూ.3 కోట్లతో కాకతీయ మ్యూజికల్‍ గార్డెన్‍ను రీఓపెనింగ్​కు చర్యలు తీసుకున్నారు. 

రూ.150 కోట్లతో జంక్షన్లు, గేట్‍ వేలు, నయా బస్టాండ్‍.. 

వరంగల్‍ ట్రైసిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లన్నీ ఇప్పుడు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దారు. కుడా తరఫున గతంలో కొన్ని జంక్షన్లను అందంగా మార్చగా, గడిచిన ఏడాదిలో కుడా తరఫున రూ.30 కోట్లతో మరిన్ని మెయిన్‍ రోడ్లు, జంక్షన్లను కలర్‍ఫుల్‍గా డెవలప్‍ చేశారు. వరంగల్‍ రైల్వే స్టేషన్‍ ముందు అత్యాధునిక బస్టాండ్‍ నిర్మాణానికి రూ.75 కోట్లు, రూ.4 కోట్లతో సిటీ చుట్టూరా ప్రధాన ద్వారాలు, (గేట్‍ వే), మడికొండ ఆక్సిజన్‍ పార్క్​ అభివృద్ధికి రూ.10 కోట్లు, కరీంనగర్‍ మార్గంలోని ఎల్కతుర్తి జంక్షన్‍ డెవలప్‍మెంట్‍కు రూ.4.29 కోట్లు, హనుమకొండ కలెక్టరేట్‍ బంగ్లాను వారసత్వ సంపదగా నయా లుక్‍, వరంగల్‍ మొగిలిచర్లలో ఏకలవ్య గుడి, వెయ్యి స్తంభాలగుడి, ఖిలా వరంగల్‍ అభివృద్ధి, వరంగల్‍ తూర్పులో ప్రత్యేక షాదిఖానాల నిర్మాణ పనులు నడుస్తున్నాయి.

జనం మెచ్చేలా రూ.600 కోట్ల కుడా ప్రాజెక్టులు..

కాంగ్రెస్‍ సర్కారు వచ్చాక సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశాలతో కుడా నిధులతో ఏడాదిలోనే జనం మెచ్చేలా దాదాపు రూ.600 కోట్ల పనులు చేపట్టాం. గత ప్రభుత్వాల్లో మూలకుపడ్డ ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍, కాళోజీ కళాక్షేత్రం, వరంగల్‍ బస్టాండ్‍, భద్రకాళి మాడవీధులు, చెరువు బ్యూటిఫికేషన్‍ వంటి ఎన్నో పనులకు వెంటనే నిధులు కేటాయించి పనులు చేశాం. రోడ్లు, జంక్షన్లను అందంగా తీర్చిదిద్దినం. భవిష్యత్తులోనూ ఓరుగల్లు నూతన నగర నిర్మాణంలో కుడా ప్రాజెక్టులు అలానే ఉంటాయ్‍.- కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి