రేపటి నుంచి 'కాకతీయ వైభవ సప్తాహం'

రేపటి నుంచి 'కాకతీయ వైభవ సప్తాహం'

వరంగల్‍, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. 'కాకతీయ వైభవ సప్తాహం' పేరుతో ఈనెల 7వ తేదీన ప్రారంభయ్యే కార్యక్రమాలు 13వ తేదీ వరకు ఓరుగల్లుతో పాటు పలు జిల్లాల్లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వాల్‍పోస్టర్‍ను మంత్రి కేటీఆర్​ మంగళవారం హైదరాబాద్‍లోని ప్రగతిభవన్‍లో ఆవిష్కరించారు. కాకతీయుల రాజధాని ఉమ్మడి వరంగల్​ కేంద్రంగా గురువారం ఉత్సవాలను అధికారులు ప్రారంభించనున్నారు. కాకతీయుల వంశస్థుల 22వ వారసులు, ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​కు  చెందిన మహరాజా కమల్​ చంద్ర భంజ్‍దేవ్​ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​.. బస్తర్​ వెళ్లి కమల్​ చంద్రను ఆహ్వానించారు. టూరిజం, మున్సిపల్​ తదితర శాఖల ఆధ్వర్యంలో వీటికి కావాల్సిన ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిర్వహణ కోసం రూ.50లక్షలు కేటాయించారు. 

కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‍లో..

కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‍లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉత్సవాల్లో కమల్​చంద్ర భంజ్‍దేవ్‍తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍, ఎంపీ సంతోష్‍కుమార్‍, మంత్రి సత్యవతి రాథోడ్‍, చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్​ చైర్మన్లు పాల్గొననున్నారు. కమల్‍చంద్ర గురువారం ఉదయం ముందుగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి ఉత్సవాల్లో పాల్గొంటారు. 

పేరిణి నృత్యాలు, కోలాటాలతో స్వాగతం

ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే కాకతీయ వారసులకు టెంపుల్​ వద్ద 500 మంది కళాకారులు, 111 మంది పేరిణి నృత్య కళాకారులు స్వాగతం పలుకుతారు. పూజ తర్వాత పోచమ్మమదాన్‍లోని రుద్రమదేవి విగ్రహానికి కమల్​ చంద్ర పూలమాల వేసి ఉత్సవాలు ప్రారంభించేందుకు ఖిలా వరంగల్​ వెళ్తారు. ఈ సందర్భంగా పేరిణి కళాకారులతో పాటు 200 మంది ఒగ్గు డోలు వాయిద్యాలు, బోనాలు, కోలాట కళాకారులతో అతిథికి స్వాగతం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.