‘కాకతీయ వైభవ సప్తాహం’ ఏర్పాట్లపై సమీక్ష

‘కాకతీయ వైభవ సప్తాహం’  ఏర్పాట్లపై సమీక్ష

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు కేంద్రంగా వెయ్యేండ్ల కిందటే కాకతీయులు పాలన సాగించారని, వారి చరిత భావితరాలకు గుర్తుండిపోయేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ సంబరాలు జరపాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దాదాపు 700 ఏండ్ల తరువాత కాకతీయుల వారసులు వస్తున్నారని, వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు చరిత్రలో నిలిచేలా ఉండాలని సూచించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ సన్నాహక సమావేశాన్ని ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో నిర్వహించారు. ఉత్సవాలకు సంబంధించి ఆఫీసర్లు వారం రోజుల ప్రణాళిక రెడీ చేయగా.. అందులో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, టూరిజం, కల్చరల్​, ఇతర డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా లీడర్లు, ఆఫీసర్లు, ఇతర నిపుణుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. అందరి సూచన మేరకు కాకతీయ సప్తాహానికి బదులు ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.

అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలకు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు కాకతీయ వంశం, చరిత్ర, ఇక్కడి ప్రాంతాలపై అవగాహన ఉన్నవాళ్లను కమిటీలో నియమించాలన్నారు. ఎన్జీవోల సహాయం తీసుకుని కాకతీయుల వైభవం ఉట్టిపడేలా ఉత్సవాలు జరపాలన్నారు. ఇప్పటికే కల్చరల్​ డిపార్ట్​మెంట్ నుంచి రూ.50 లక్షలు కేటాయించామని, నిధుల కొరత ఏమీ లేదన్నారు. కాకతీయుల చరిత్రను ఒక డాక్యుమెంటరీ రూపొందించాలన్నారు. వివిధ ప్రజాప్రతినిధులు, నిపుణలు సూచించిన సలహాలను పాటించాలని, షెడ్యూల్​ లో కూడా మార్పులు చేయాలని సూచించారు. 

శాసనాలు, చిహ్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఈ ఉత్సవాల్లో కాకతీయుల శాసనాలు, చిహ్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. కాకతీయుల విజయ చిహ్నమైన కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గొలుసుకట్టు చెరువులు, కాకతీయుల కట్టడాలు, ఇంజినీరింగ్ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. 

17 ప్రాంతాలను డెవలప్ ​చేయాలి

ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. ఖిలా వరంగల్ లో ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ ​గుర్తించిన 17 ప్రాంతాలను డెవలప్​చేయాలని, విద్యుత్​వెలుగులతో కళకళలాడేలా చూడాలన్నారు. ఉత్సవాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాలు చాలా ముఖ్యమని, కోటగుళ్లు, పాండవుల గుట్టను డెవలప్​ చేయాలన్నారు. కాకతీయుల చరిత్రను ఇప్పటివరకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారని, దానికీ సమగ్ర రూపం తీసుకురావాలన్నారు. ఏడు రోజులు చేపట్టే ఈ ఉత్సవాల్లో కళాకారులు, కవులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. 

యునెస్కో గుర్తింపు కోసం వేయి స్తంభాల గుడిని ప్రతిపాదించాం 

ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. కాకతీయుల చరిత్రపై ఫొటోగ్రఫి, పెయింటింగ్​, షార్ట్​ ఫిల్మ్​ వర్క్​ షాపు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ మాట్లాడుతూ.. కాకతీయ సప్తాహంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.  టూరిజం, కల్చరల్​, జీడబ్ల్యూఎంసీ, కుడా అన్ని డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు సమన్వయంతో కాకతీయ వైభవ సప్తాహాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతటా ఫొటో ఎగ్జిబిషన్స్​ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ కోట, వేయి స్తంభాల గుడిని యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించామని, ఉత్సవాల్లో భాగంగా వాటికి తగిన గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​ కోరారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నిపుణుల సలహాలు, సూచనలతో విజయవంతం చేస్తామని చెప్పారు. 

కమల్ చంద్ర భంజ్ కు పేరిణి కళాకారులతో స్వాగతం

సాంస్కృతిక శాఖ డైరెక్టర్​ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ కు 111 మంది పేరిణి కళాకారులతో స్వాగత కార్యక్రమం, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఉంటుందన్నారు. చందుపట్లలోని రాణి రుద్రమాదేవి మరణ శాసనం వద్ద ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. స్టూడెంట్లను భాగస్వాములను చేసేలా స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు ఉంటాయని, ఎన్ఐటీ, కాకతీయ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్ నగర మేయర్​ గుండు సుధారాణి, కుడా చైర్మన్​ సుందర్​ రాజు, వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి, ఉమ్మడి వరంగల్​లోని ఆరు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్​ కమిషనర్​ ప్రావీణ్య, అడిషనల్​ కలెక్టర్లు, టూరిజం, కల్చరల్​, వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు పాల్గొన్నారు.