
- రూ.1,310 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఆరో ఇన్ఫ్రా రియల్టీ సబ్సిడరీ కాకినాడ సెజ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని కోన గ్రామంలో మూడు 50 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) డీసాలినేషన్ (శుద్ధి) కెపాసిటీ ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.1,310 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రతిపాదనను కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ( సీఆర్‌జెడ్) క్లియరెన్స్ కోసం కేంద్ర వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) జూన్ 26న జరిగిన సమావేశంలో కొన్ని షరతులతో సిఫార్సు చేసింది.
ప్లాంట్‌లో 380 ఎంఎల్‌డీ సముద్ర జలాన్ని రెండు పైప్‌లైన్‌ల ద్వారా తీసుకుంటారు. డిసాలినేషన్ అయిన నీటిని పరిశ్రమలు, ఓడరేవుకు పైప్‌లైన్‌ల ద్వారా సరఫరా చేస్తారు. వ్యర్ధాలను సముద్రంలోకి విడుదల చేయడానికి ఒక ఔట్‌ఫాల్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. సముద్ర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ వ్యర్ధాలను మళ్లీ వాడుకునేలా ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాలని ఈఏసీ షరతు విధించింది.