
బెంగళూరు: గుడి పేరుతో దొంగ వెబ్సైట్లు తయారుచేసి కోట్లు కొల్లగొట్టిన సంఘటన కర్నాటకలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఎనిమిది వెబ్సైట్లను ఓపెన్ చేసి పూజారులు సొమ్ము వసూలు చేశారు. నాలుగేళ్ల పాటు సాగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కులబుర్గి జిల్లాలోని దేవలగనాపూర్ గుడికి కర్నాటకతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా భక్తులు వెళ్తుంటారు. అక్కడ కొలువైన దత్తాత్రేయుడిని దర్శించుకుని వస్తుంటారు. ప్రజల్లో ఉన్న భక్తిని సొమ్ము చేసుకోవడానికి ఆ ఆలయ పూజారులు ప్లాన్ వేశారు. గుడి పేరుతో ఫేక్ వెబ్సైట్లు తయారు చేశారు. గుడిలో చేసే వివిధ పూజలకు ఆన్లైన్లో ఫీజులు వసూలు చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో విరాళాలు సేకరించారు. ఇలా వచ్చిన మొత్తాన్ని తమ పర్సనల్ ఖాతాల్లోకి మళ్లించారు. దాదాపు 2 వేల మందికి పైగా భక్తుల నుంచి రూ.20 కోట్ల దాకా వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆడిట్లో ఈ దొంగ వెబ్సైట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ యశ్వంత్ గురుకార్దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసు నమోదు కావడంతో ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉన్న పూజారులు జారుకున్నారు. కాగా, ఆలయంలోని హుండీ సొమ్మును కూడా కాజేసి ఉంటారని పోలీసులు
అనుమానం వ్యక్తం చేస్తున్నారు.