కలమడు గు జాతరకు వేళాయే..జనవరి 31 నుంచి నరనారాయణ స్వామి జాతర

కలమడు గు జాతరకు వేళాయే..జనవరి 31 నుంచి నరనారాయణ స్వామి జాతర
  •     వేములవాడ చాళుక్యులు నిర్మించిన ఆలయం
  •     దేశంలోనే రెండో పురాతన గుడి

జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లిత్తున్న నరనారాయణ స్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31 నుంచి జాతర ప్రారంభం కానుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జన్నారం మండలంలో జరిగే ఎకైక జాతర కావడంతో మండలం నుంచే కాకుండా మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరై స్వామివారిని దర్శించుకుంటారు.

కేదార్​నాథ్​ ఆలయం తర్వాత ఇదే..

700 ఏండ్ల క్రితం వేములవాడ చాళుక్యులు కలమడుగులో నర నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. నాడు కలమడుగు పడమరకు గోదావరి నది, ఉత్తరం వైపు వాగు ఉండి రెండు వైపులా నీరు ప్రవహిస్తుండటం వల్ల ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని గ్రామస్తులు చెబుతుంటారు. ఉత్తరఖండ్ లోని ప్రముఖ కేదార్ నాథ్ ఆలయం తర్వాత దేశంలోనే రెండో పురాతన దేవస్థానంగా ఈ గుడి ప్రసిద్ధి  చెందింది.

శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని గ్రామస్తులంతా కలిసి 1985లో పునర్ నిర్మించి కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతాబోధ చేసే సన్నివేశాన్ని చిత్రంగా మలిచి ఆలయ గోపురంపై ప్రతిష్టించారని ఆలయ ప్రధాన పూజరి కాకర నర్సయ్య తెలిపారు.

జాతరకు అన్ని ఏర్పాట్లు

ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజల పాటు నిర్వహించే జాతరలో హోమంతో పాటు ప్రతి రోజు ప్రత్యేక పూజలు, చివరి రోజైన సోమవారం సాయంత్రం స్వామి వారిని ప్రత్యేక రథంలో ఊరేగించనున్నారు. జాతరకు వచ్చే యువకుల కోసం ఉమ్మడి జిల్లా స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు.