
జన్నారం, వెలుగు: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలంలోని కలమడుగులో కొత్తగా నిర్మించిన అయుష్మాన్ ఆరోగ్య మందిర్(పల్లె దవాఖానా)ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు.
ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహకు ఇప్పటికే విన్నవించానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం ఇద్దరు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో హరీశ్ రాజ్, డాక్టర్ ఉమాశ్రీ, గంగాదేవి, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, నాయకులు మోహన్ రెడ్డి, మచ్చ శంకరయ్య, రాజశేఖర్, ఇందయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ ఏర్పాట్ల పరిశీలన
మండల కేంద్రంలోని హరిత రిసార్ట్లో ఈ నెల 11,12,13 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ గిరిజన నాయకుల శిక్షణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి పరిశీలించారు. మూడ్రోజుల పాటు జరిగే ఉమ్మడి జిల్లా గిరిజన నాయకుల శిక్షణ శిబిరానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క, ఏఐసీసీ జాతీయ నేత కొప్పుల రాజు, విశ్వానాథన్ హాజరవుతారని బొజ్జు పటేల్ తెలిపారు. పార్టీ ప్రధాన నేత అత్రం సుగుణ, మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, సయ్యద్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.