భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆదివారం రామాలయంలో కళావాహన, జీర్ణోద్ధరణకు అనుజ్ఞ వైదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్‌స్వామి హాజరయ్యారు. రిటైర్డ్ ప్రధానార్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు ఆధ్వర్యంలో ఉపప్రధానార్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు వైదిక సిబ్బందితో కలిసి గోదావరి నుంచి తీర్ధబిందెల్లో జలాలను తీసుకొచ్చారు.
అనంతరం దేవతామూర్తులతో పాటు భక్తరామదాసు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆండాళ్లమ్మకు చినజీయర్ స్వామి హారతులు ఇచ్చి, హోమ కార్యక్రమాలను ప్రారంభించారు. గోదాదేవి, లక్ష్మీతాయారు అమ్మవార్ల విగ్రహాలను శ్రీసీతారామచంద్రస్వామి ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించారు.
చుట్టు ఉన్న 15 ఆలయాల్లోని 72 దేవతామూర్తులను కలశాల్లో ఆవాహన చేసి కళావాహన వేడుకను జరిపారు. తర్వాత 72 దేవతామూర్తులను, కలశాలను రంగనాయకుల గుట్టపై ఉన్న ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం అర్చకులతో పాటు యాదగిరిగుట్ట, సింహాచలం, ధర్మపురి ఆలయాల నుంచి వచ్చిన అర్చకులు పాల్గొన్నారు. కళావాహన వేడుక సందర్భంగా ఆదివారం తెల్లవారుఝాము నుంచే భక్తులకు దర్శనాలను నిలిపివేయగా.. సాయంత్రం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇచ్చారు.
ఆళ్వార్ల గురించి తెలుసుకోవాలి : చినజీయర్ స్వామి
భద్రాచలం ఆలయ జీర్ణోద్ధరణ తర్వాత ఆళ్వార్లు, దేవతామూర్తులు గురించి భక్తులు సమగ్రంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని త్రిదండి చినజీయర్‌స్వామి సూచించారు. కళావాహన, అనుజ్ఞ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాకార మండపాల్లో ఏర్పాటు చేసే దేవతామూర్తుల పూర్తి వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో దామోదర్‌రావుకు సూచించారు. ఒకరి సంప్రదాయంలో మరొకరు వేలు పెట్టొద్దని, వెయ్యేండ్ల కిందే రామానుజాచార్యులు ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు నిర్ణయించారని స్పష్టం చేశారు.

