ప్రభుత్వ ఖర్చుతోనే కాళేశ్వరం రిపేర్లు!

ప్రభుత్వ ఖర్చుతోనే  కాళేశ్వరం రిపేర్లు!
  • అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని మొండికేస్తున్న సంస్థలు
  •     క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం లేదు 
  •     బ్యారేజీలను త్వరగా వాడుకలోకి తేవాలని సర్కారు యత్నం 
  •     బోర్​హోల్స్ కోసం రాజస్తాన్ నుంచి ప్రత్యేక రిగ్గులు, కట్టర్లు
  •     బ్యారేజీల స్ట్రక్చర్లకు నష్టం జరగకుండా పనులు చేసేందుకు చర్యలు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ల ఖర్చు ప్రభుత్వం నెత్తినే పడేలా కనిపిస్తోంది. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు రిపేర్లు చేసి, వీలైనంత త్వరగా వాడుకలోకి తీసుకురావాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఖర్చులను తానే భరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వాస్తవానికి మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్​లోనే దెబ్బతిన్నాయి. ఆ డ్యామేజీలకు నిర్మాణ సంస్థలు రిపేర్లు చేయకపోవడం వల్లే 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రిపోర్టులూ తేల్చాయి. 

రిపేర్లకు నిర్మాణ సంస్థలతోనే ఖర్చు పెట్టించాలని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్, విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా తేల్చి చెప్పాయి. దీంతో ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఆయా రిపోర్టుల ఆధారంగా ఎల్ అండ్ టీతోపాటు ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలే రిపేర్ల ఖర్చులను భరించాలని తేల్చిచెప్పింది. పలు మార్లు లేఖలూ రాసింది. కానీ సంస్థలు మాత్రం ససేమిరా అన్నాయి. దీంతో క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. 

పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిగాయి. కానీ, సంస్థల నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఖర్చులను తాము భరించబోమని, ప్రభుత్వం మళ్లీ కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఎల్ అండ్ టీ కరాఖండిగా చెప్పేసింది. మరోవైపు బ్యారేజీలకు వీలైనంత త్వరగా రిపేర్లు పూర్తిచేయాలని ఇటీవల సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. రిపేర్లు లేటైనకొద్దీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించడం వల్లే సంస్థలతో అగ్రిమెంట్ చేసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అన్ని అంశాలనూ పరిశీలించాకే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు ఓ అధికారి ‘వెలుగు’కు వివరించారు.

రాజస్తాన్ నుంచి బోర్​హోల్స్ పరికరాలు

బ్యారేజీల రిపేర్లకు బోర్​హోల్స్ ప్రధాన​సమస్యగా మారాయి. మూడు బ్యారేజీల వద్ద వెయ్యి వరకు బోర్​హోల్స్ వెయ్యాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. బోర్​హోల్స్ వేసే క్రమంలో బ్యారేజీల స్ట్రక్చర్లకు డ్యామేజ్​ జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బోర్​హోల్స్ కోసం ప్రత్యేకమైన రిగ్స్ వాడాల్సి ఉంటుందని సీఎంతో జరిగిన మీటింగ్​లో అధికారులు వివరించినట్టు తెలిసింది. 

బోర్​హోల్స్ వేసే చోట్ల కాంక్రీట్ నిర్మాణాలు దెబ్బతినకుండా అక్కడి వరకే కట్​చేసే పరికరాలూ రాజస్తాన్ నుంచి తెప్పించాల్సి ఉంటుందని వివరించినట్టు సమాచారం. దీంతో ఆయా పరికరాల సమీకరణపైనా అధికారులు దృష్టి పెట్టారు. 

వర్షాకాలంలోగా టెస్టులు..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్షాకాలంలోపు టెస్టులను పూర్తి చేయాల్సిందేనని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధికారులంతా అక్కడే మకాం వేసి, నిరంతరం పనులను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణుల ఆధ్వర్యంలోనే టెస్టులను నిర్వహించనున్నారు. 

ప్రత్యేకంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించడంతో.. ఆ దిశగా ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ సెక్రటరీ అధికారులతో రివ్యూ కూడా చేశారు. పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.