అసెంబ్లీకి కాళేశ్వరం కమిషన్ నివేదిక: సీఎం రేవంత్ కీలక ప్రకటన

అసెంబ్లీకి కాళేశ్వరం కమిషన్ నివేదిక: సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన పీసీ ఘోష్ నిబద్ధత ఉన్న వ్యక్తి అని రేవంత్ చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు సహా అనేక మందిని ఘోష్ విచారించారని, 16 నెలల విచారణ తరువాత 665 పేజీల నివేదిక ఇచ్చారని సీఎం తెలిపారు.

ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. అలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిపోయిందని సీఎం విమర్శించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించారని, రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ డిజైన్లను మార్చారని ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మించిన మూడేళ్ల లోపే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని సీఎం గుర్తు చేశారు. అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలున్నాయని NDSA (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) రిపోర్ట్ ఇచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు.

కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని, త్వరలోనే అసెంబ్లీకి నివేదికను రిపోర్ట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని పార్టీల సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తామని రేవంత్ చెప్పారు. ఇది ఒక రాజకీయ పార్టీనో లేక ప్రభుత్వమో ఇచ్చిన రిపోర్ట్ కాదని.. కమిషన్ నివేదికను కేబినెట్లో చర్చించి ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదిక ఇస్తామని, అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని సీఎం రేవంత్ వెల్లడించారు. ఎవరి పైనా వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయాలు తీసుకోవడం లేదని, కమిషన్ రిపోర్ట్పై ఎవరు ఏ రకంగా మాట్లాడతారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.