రెండుమూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్!

రెండుమూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్!
  • హైదరాబాద్​కు చేరుకున్న కమిషన్​ చైర్మన్ జస్టిస్​ ఘోష్​
  • అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఇప్పటిదాకా 119 మంది విచారణ
  • వారి స్టేట్​మెంట్ల ఆధారంగా న్యాయ సమస్యలు రాకుండా రిపోర్ట్​ తయారీ

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ రిపోర్టుకు సర్వం సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్​ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ఆదివారం హైదరాబాద్​కు చేరుకున్నారు. 

కాళేశ్వరం కుంగిన ఘటనపై నిరుడు మార్చిలో జ్యుడీషియల్​ కమిషన్​ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. జూన్​ నుంచి దాదాపు ఏడాది పాటు సుదీర్ఘ విచారణ చేపట్టింది. అందులో భాగంగా అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్​ ఈఎన్సీలు, సీఈలు, అధికారులతో పాటు మొత్తం 119 మంది నుంచి విచారణ స్టేట్​మెంట్లను తీసుకున్నది. వాళ్ల విచారణ అనంతరం ఇటీవల మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​నూ కమిషన్​ విచారించి వివరాలు రాబట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా కమిషన్​ తుది నివేదికను తయారు చేసింది. 

జులై 31 వరకే గడువు

కమిషన్​ గడువు జులై 31తో ముగియనుంది. వాస్తవానికి కమిషన్​ గడువును ఇప్పటికే ప్రభుత్వం ఏడుసార్లు పొడిగించింది. అధికారులు అఫిడవిట్లు సమర్పించడం, విచారించడం ఆలస్యమైంది. వారి నుంచి సమగ్ర వివరాలను సేకరించాల్సి ఉన్నందున తొలుత అందరి నుంచి కమిషన్​ అఫిడవిట్లను తీసుకున్నది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే అధికారులను కమిషన్​ క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసింది. ఇద్దరు ముగ్గురు అధికారులను రెండు మూడు సార్లు క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసింది. అంతా అయిపోతుంది.. డ్రాఫ్ట్​ రిపోర్టు కూడా సిద్ధమైందనుకున్న దశలో కమిషన్​ గడువును ప్రభుత్వం గత మేలో మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతా రిపోర్టు తయారీ కోసమేనని అనుకున్నా.. చివరి నిమిషంలో కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ను విచారించేందుకు కమిషన్​ నోటీసులు పంపింది. అందులో భాగంగా జూన్​ 6న ఈటల రాజేందర్​, 9న హరీశ్​రావు, 11న కేసీఆర్​ను విచారించింది. వారి స్టేట్​మెంట్లను తీసుకున్న కమిషన్​ చైర్మన్​.. లీగల్​ ఒపీనియన్లు తీసుకుంటూ జాగ్రత్తగా రిపోర్టును తయారు చేసినట్టు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలుస్తున్నది.