కాళేశ్వరం కరెంటు బిల్లు రూ.5 వేల కోట్లే…

కాళేశ్వరం కరెంటు బిల్లు రూ.5 వేల కోట్లే…
  •                జూన్​ నుంచి నవంబర్​ వరకు 360 టీఎంసీలు లిఫ్ట్​ చేస్తం
  •                 మిగతా టైంలో మరో 40 టీఎంసీలు వస్తయి
  •                 ఈనెల 9న లేదా 12న మిడ్​మానేరుకు నీటి తరలింపు
  •                 కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే కరెంటు బిల్లు ఏడాదికి రూ. ఐదు వేల కోట్లు మాత్రమేనని, అవసరమైతే 15 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఏటా జూన్​ నుంచి నవంబర్​ వరకు నెలకు 60 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి.. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తరుగులేని, తిరుగులేని గొప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసుకున్నామని చెప్పారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి లక్ష్మీ నర్సింహస్వామి పాదాల వరకు సుమారు 150 కిలోమీటర్ల మేర నిలిచిన సజీవ గోదావరిని చూసి తన మనసు పులకరించిపోతోందన్నారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్.. తర్వాత ధర్మపురి లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..

‘‘తెలంగాణ సాధించుకోవడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం తరుగులేని, తిరుగులేని గొప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసుకున్నం. గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలే అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 20 నుంచి 25 ఏండ్లు పట్టేది. ఇది మామూలు విషయం కాదు. ఒక్కో బ్యారేజీ ఒక ప్రాజెక్టుగా, ఒక పంపుహౌజ్​ ఒక ప్రాజెక్టుగ ఉన్నయ్. అహోరాత్రులు శ్రమించి నేను రీ డిజైనింగ్‌ చేయడమే కాదు, మా ఇంజనీరింగ్‌ సిబ్బంది రాత్రీపగలు లేకుండ కుటుంబాల్ని వదిలిపెట్టి మూడేండ్లలో పూర్తి చేసిన్రు. వాళ్లందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు చెప్తున్న.

ఎల్లంపల్లి ప్రాజెక్టే కేంద్రం

ఎల్లంపల్లి ప్రాజెక్టుపై భారం పెరిగింది. మంథని లిఫ్టు, హైదరాబాద్‌ తాగునీటి పథకం, మిషన్‌ భగీరథ, కడెం ఆయకట్టు, ఎస్సారెస్పీ టెయిల్​ ఎండ్‌లో పెట్టుకున్న లిఫ్టులు, గూడెం లిఫ్టు ఇరిగేషన్‌, రామగుండంలోని ఎఫ్‌సీఐ, ఇప్పుడున్న ఎన్టీపీసీ, కొత్తగా కడుతున్న పవర్​ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచే నీళ్లివ్వాలి. ఒక్క ఎన్టీపీసీకే 20 టీఎంసీల నీళ్లు కావాలి. జల మండలికి 30 టీఎంసీలివ్వాలి. మొత్తంగా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 75 టీఎంసీల వినియోగం ఉంది. అందుకే వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఎల్లంపల్లికి రోజూ మూడు టీఎంసీలను తరలిస్తం. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు రోజుకు రెండు టీఎంసీల తరలింపు మొదలైతది. మల్లన్నసాగర్‌ నుంచి చివరన ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు ఏడు వేల క్యూసెక్కులు తీసుకెళ్తం.

కరెంటు బిల్లు ఏడాదికి రూ. 5 వేల కోట్లే..

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 400 టీఎంసీలు ఎత్తిపోయడానికి సంవత్సరానికి రూ. 4,992 కోట్లు మాత్రమే ఖర్చయితయి. రౌండ్​ఫిగర్​ చూసుకుంటే ఐదు వేల కోట్లు. ప్రతి సంవత్సరం ఇన్ని వేల కోట్లు ఖర్చుపెట్టం. నాలుగైదేండ్ల కోసారైనా ఎస్సారెస్పీ నిండుతది. అప్పుడు లిఫ్ట్​ చెయ్యం. శ్రీరాంసాగర్​ నుంచే వరద కాల్వ, కాకతీయ కాల్వ ద్వారా మిడ్​మానేరు, లోయర్​ మానేరు డ్యాం నింపుకుంటం. మిడ్​ మానేరు నుంచి మల్లన్నసాగర్​కు లిఫ్ట్​ చేస్తం. వరద ఆగిపోయినంక.. అవసరం మేరకు మేడిగడ్డ నుంచి లిఫ్ట్​ చేస్తం. ఎల్లంపల్లికే వరద వస్తే అక్కడి నుంచే ఎత్తిపోసుకుంటం. కానీ కొందరు ఇంత కరెంటు, అంత కరెంటు, 20 కోట్లు బిల్లు, 10 కోట్లు బిల్లు అని మాట్లాడుతున్నరు. వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. తెలంగాణ రైతుల కోసం, పరిశ్రమల కోసం, తాగునీటి కష్టాలు తీర్చేందుకు 5 వేల కోట్లు కాదు.. అవసరమైతే 15 వేల కోట్లయినా ఖర్చుపెడ్తం. ఈ ప్రాజెక్టును సఫలీకృతం చేయడానికి మహారాష్ట్రను ఒప్పించినం. ఇప్పుడు 91 వేల ఎకరాల గోదావరి బెడ్​ను వాడుకుని… రైతులకు ఎక్కువ నష్టం రాకుండా చూసినం. గత్యంతరం లేని మల్లన్నసాగర్​ లాంటి చోట్ల మాత్రమే భూములు సేకరించినం.

250 కిలోమీటర్ల మేర సజీవ గోదావరి

మేడిగడ్డ దిగువన దేవాదుల వద్ద తుపాకుల గూడెం, దుమ్ము గూడెం ప్రాజెక్టులు త్వరలో పూర్తి కాబోతున్నయి. తుపాకుల గూడెం వద్ద 7 టీఎంసీలు, దుమ్ముగూడెంలో 30 టీఎంసీల నీరు నిల్వ ఉంటయి. పైన 150 కిలోమీటర్లకు అదో వంద కిలోమీటర్లు కలిపితే 250 కిలోమీటర్ల మేర 100 టీఎంసీల నీళ్లను ఒడిసిపట్టుకొన్న సజీవ గోదావరి తెలంగాణ ప్రజలకు నీరిచ్చేందుకు సంసిద్ధంగా ఉంటది. కృష్ణాలో గొడవలున్నయి. మనకు గోదావరే గతి.

ఈ నెల 9 లేదా 12న లింక్‌-2 ప్రారంభం

మిడ్‌మానేరు వరకు నీటి తరలింపు పూర్తయితే ప్రాజెక్టు లక్ష్యం దాదాపు -65 శాతం పూర్తయినట్లే. శ్రావణ మాసం అంతా శుభప్రదంగా ఉంటది కాబట్టి శ్రావణ శుక్రవారంగానీ, సోమవారంగానీ మిడ్‌ మానేరుకు నీళ్లు విడుదల కావాలని అక్కడ పని చేసే ఇంజినీర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలకు చెప్పిన. వీలైతే నేనుగానీ, మంత్రులుగానీ వచ్చి ప్రారంభిస్తం. అంతా పూర్తయితే ఎస్సారెస్పీ, అప్పర్‌ మానేరు, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, సింగూరు నిండుకుండల్లా ఉంటయి.

కేసులు వేసినా చేసి చూపించినం

కొంతమంది ప్రగతి నిరోధకులు, రాజకీయ శక్తులు కుట్రలు పన్ని ప్రాజెక్టు మీద 300పైచిలుకు కేసులు వేసిన్రు. వాటన్నింటినీ అధిగమించి, కావాల్సినవి సాధించి ఫలితాలు ప్రత్యక్షంగా అందుకోబోతున్నం. కాళేశ్వరం మన ముందుకు వచ్చింది. దేవాదుల త్వరలో పూర్తి చేసి వాడుకుంటం. సీతారామ ఫలితాలు కనిపిస్తున్నయి. ఈ రకంగా కరెంట్‌ కోతలు లేని తెలంగాణ, మంచినీళ్ల బాధలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు లేని తెలంగాణ.. సాగునీటికి మలమలమాడి బాధపడిన తెలంగాణ పోయి సస్యశ్యామలంగా పారే తెలంగాణను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాకారం చేసింది. ఇవిగాక చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నం. ఉదాహరణకు మహబూబ్‌నగర్‌లో ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులు ప్రారంభించినం. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నం. పాలమూరు లిఫ్ట్​ ఇరిగేషన్‌ స్కీంకు మొన్ననే పది వేల కోట్ల మంజూరు తీసుకున్నం. త్వరలోనే పూర్తి చేస్తం.

గోదావరిలో నాణాలు వేసి మొక్కిన

మా ఊరికి, మా భూమికి రా అంటూ బహు శా గోదావరిలో నేను వేసినన్ని నాణాలు ప్రపంచంలో ఎవరూ వేసి ఉండరు. మంచిర్యాల జిల్లాకు, రాయపట్నం మీదుగా గానీ, గోదావరి బ్రిడ్జి మీది నుంచిగానీ పోతుంటే వాహనం ఆపి మరీ నాణాలు వేసేవాడిని.

శ్రీరాంసాగర్​కూ జీవమొస్తది

మొన్న మేడిగడ్డ దగ్గర 9.50 లక్షల క్యూసెక్కుల వరద ఉంటే శ్రీరాంసాగర్‌కు 74 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోనే ఉంది. అంటే పైన వెలవెల.. కింద గలగల అన్నట్టు. ఎస్సారెస్పీలో ఇప్పుడు 9.06 టీఎంసీల నిల్వ ఉంది. చాలా దుర్భరమైన పరిస్థితి. కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నరు. ఎస్సారెస్పీలోకి 90 టీఎంసీలు ఎత్తిపొయ్యం. ఇప్పుడు ఎస్సారెస్పీలోకి 9 టీఎంసీలు వచ్చినయి. ఇంకో 2-3 టీఎంసీలు రావచ్చు. శ్రీరాంసాగర్​ ఆయకట్టు కిందికి కట్‌ అయిపోయిన తర్వాత పైన 7 లక్షల ఎకరాలు ఉంటది. అందుకు 70 టీఎంసీలు కావాలె. అందులో 5,-10 టీఎంసీలు ఎగువ నుంచి వస్తే ఇంకో 30-,40 టీఎంసీలు మనం ఎత్తిపోసుకుంటం. ఇందుకోసం ఎస్సారెస్పీ వరద కాల్వను రిజర్వాయర్‌గా మల్చుకున్నం. దాంట్లో పంపులు పెట్టుకొని ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఢోకా లేకుండా చూసుకుంటం. అవసరమైతే నిజాంసాగర్‌, సింగూరుకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తం. హైదరాబాద్‌ నగరానికి పుష్కలంగా మంచినీళ్లు ఇవ్వగలుగుతం.

మెదడు కరిగించి చేసినం..

44 ఏండ్ల సీడబ్ల్యూసీ రికార్డుల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేసినం. ఏదో అల్లాటప్పాగా ఎల్లయ్య, మల్లయ్య చెప్తె చేసింది కాదు. మెదడును కరిగించి చేసిన పని. ప్రారంభంలో కొన్ని అనుమనాలుండె. కానీ ముందు అనుకున్న దానికన్నా మించిన జల దృశ్యం ఇప్పుడు సాక్షాత్కరించింది. ఇప్పటికే ఉన్న ఎస్సారెస్పీ, నిజాంసాగర్​, సింగూరు ప్రాజెక్టులకు అదనంగా కాళేశ్వరం నుంచి ఏటా 400 టీఎంసీలు తీసుకుంటం. 45 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయి. జూన్​ టు నవంబర్​ వరకు నెలకు 60 టీఎంసీల చొప్పున ఆరు నెలలకు360 టీఎంసీలు, నవంబర్​ నుంచి జూన్ వరకు మరో 40 టీఎంసీలను ఏ సమస్య లేకుండా లిఫ్ట్ చేసుకుంటం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్న. దీన్ని ఇంకోలా చూడొద్దు. ఏదో పిచ్చివాళ్లు మాట్లాడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

575 టీఎంసీల నీళ్లిచ్చే ప్రాజెక్టులు

గతంలో ఉన్న ప్రాజెక్టులను మినహాయిస్తే ఒక్క కాళేశ్వరంతో 400 టీఎంసీలు వాడుకుంటం. ఇది కాకుండా దేవాదుల (తుపాకులగూడెం) నుంచి 75 టీఎంసీలు వాడుకుంటం. ఇక్కడ 6 నుంచి 8 టీఎంసీల వరకు నీళ్లు నిలిచి ఉంటయి. 365 రోజులు పంపింగ్‌ చేసుకునే అవకాశం ఉంటది. దాని దిగువన దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టును రూ. 13 వేల కోట్లతో నిర్మిస్తున్నం. అది పూర్తయితే 100 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాకు తీసుకుంటం. ఇట్ల 575 టీఎంసీల నీళ్లతో పాత మహబూబ్‌నగర్‌ జిల్లా, నల్గొండలో సౌత్‌, వెస్ట్‌ ప్రాంతాలు తప్ప తెలంగాణంతా గోదావరి నీళ్లు పారుతయి. కేంద్రం రూపాయి ఇయ్యకున్నా అన్నీ పూర్తిచేసుకున్నం.

ధర్మపురికి మరో రూ.50 కోట్లు

ధర్మపురి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తం. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని, శివాలయాన్ని మంచిగ చేస్తం. ఇంకా ఎక్కువ నిధులైనా ఇస్తం. గతంలో 50 కోట్లు ప్రకటించినం. ఇంకా 50 కోట్లు ఇస్తం. మరోసారి వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ్నే ఉండి పనులు పరిశీలిస్త. గొప్ప క్షేత్రంగా ధర్మపురిని తీర్చి దిద్దుతం. గోదావరి దగ్గర స్థలాలను వాడుకుదాం. ఇరుకైన వీధులను పెద్దగ చేసుకోవాలె. నియోజకవర్గంలో ఆరు మండల కేంద్రాలు, 142 పంచాయతీలు, ధర్మపురి మున్సిపాలిటీ ఉంది. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, మండల కేంద్రానికి రూ.25 లక్షలు, ధర్మపురి టౌన్​కు 10 కోట్లు వెంటనే విడుదల చేస్తం. ఆర్కిటెక్టు ఆనంద్​ సాయిని, యాదాద్రి శిల్పులను పంపి, ఆలయ అభివృద్ధికి ప్లాన్​ రూపొందిస్తం.

నెల రోజుల్లో భగీరథ పూర్తి

మిషన్‌ భగీరథ అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. యావత్‌ దేశం, కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంటున్నది. మరోనెల రోజుల్లో మిషన్‌ భగీరథ పరిపూర్ణం అయితది. మే నెలలో వచ్చిన భయంకర ఎండల వల్ల మూడు వేల పైచిలుకు ట్యాంకుల నిర్మాణాన్ని ఆపేయాలని నేనే చెప్పిన. అవి పూర్తయ్యే దశలో ఉన్నయి. అంత వేడిల కడితే పగుళ్లు వచ్చి ఇబ్బంది వస్తదని ఆపేయమన్నం. ఎండాకాలం తర్వాత మళ్లీ ప్రారంభించిన్రు. నెల రోజుల్లో ఆ పనులన్నీ పూర్తయితయి. 56 లక్షల ఇండ్లకు మంచినీళ్లను సరఫరా చేస్తం. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ఉండే ధనికులు ఎలాంటి నీళ్లు తాగుతరో.. ఆదిలాబాద్‌ గోండు గూడెంల ఆదివాసీలు, నల్లగొండ తండాల్లోని గిరిజనులు అవే నీళ్లు తాగుతరు.