ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ

ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ
  • పాక్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ

న్యూఢిల్లీ:  పాకిస్తాన్​తో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్​తో భేటీ అయ్యారు. పాక్​తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తున్నది. ప్రధానితో ఎయిర్ ఫోర్స్ చీఫ్ సమావేశానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడి కాలేదు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్​లోని పహల్గాం వద్ద పాక్ టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్తన్​తో ఉద్రిక్తతలు పెరిగాయి. 

ఇప్పటికే గత మంగళవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ, రక్షణ మంత్రితో ప్రధాని కీలక సమావేశం నిర్వహించారు. పాక్ లోని టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులకు సిద్ధం కావాలని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రధాని ప్రకటించారు. తర్వాత శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి కూడా ప్రధానిని కలిసి అరేబియన్ సముద్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా.. దాడులకు సిద్ధమని నేవీ కూడా ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎయిర్ ఫోర్స్ చీఫ్ తోనూ ప్రధాని మరోసారి భేటీ కావడంతో వాయుసేన సన్నద్ధతపైనా కీలక చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.