యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ ఖేల్​ ఖతం

యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ ఖేల్​ ఖతం
  • 96 గంటలకు సరిపడా బుల్లెట్లే ఉన్నయ్..  ఖాళీగా ఆయుధ గోదాములు
  • ఫైటర్ జెట్ల ఫ్యూయెల్​కు డబ్బుల్లేవు..  జవాన్లకు రేషన్ తగ్గించిన ప్రభుత్వం
  • ఉక్రెయిన్​కు బుల్లెట్లు అమ్ముకుని డబ్బు చేసుకున్న పాక్
  • ఆయుధాలు తయారు చేద్దామన్నా.. ఫ్యాక్టరీల్లో సౌలత్​లు లేవు

న్యూఢిల్లీ: ఇండియాతో పాకిస్తాన్​కు యుద్ధం చేయాల్సి వస్తే.. ఆ దేశం వద్ద సరిపడా ఆయుధాల్లేవని తెలుస్తున్నది. కేవలం 4 రోజులకు సరిపడా శతఘ్ని గుండ్లు (యాంటీ -ఏయిర్‌‌క్రాఫ్ట్ గన్ అమ్యునిషన్) మాత్రమే ఉన్నట్లు ఓ నేషనల్ మీడియా స్పష్టం చేసింది. ఇండియాతో పాకిస్తాన్ దీటుగా పోరాడలేదని, కొద్ది రోజుల్లోనే వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందని తెలిపింది. 

పాకిస్తాన్ ఆర్మీకి కీలక ఆయుధాలు, బుల్లెట్లు సరఫరా చేయడంలో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (పీవోఎఫ్) తీవ్రంగా విఫలమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలకు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని తెలుస్తున్నది. దీనికితోడు పీవోఎఫ్.. వద్ద ఆయుధాల తయారీకి సౌకర్యాల్లేవు. 15 ఎంఎం ఆర్టిలరీ షెల్స్​ను పాకిస్తాన్ ఇటీవల ఉక్రెయిన్​కు అమ్ముకోవడంతో తీవ్ర కొరత నెలకొన్నది. ఇప్పుడు ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తున్నది. 

ఆయుధాల సమస్య పాకిస్తాన్ సైనిక వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో ఆర్మీ ఉన్నతాధికారులు, జవాన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాకిస్తాన్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అప్పుల భారం, విదేశీ మారక నిల్వల క్షీణత వంటివి పాకిస్తాన్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రక్షణ వ్యవస్థకు సరిపడా నిధులు కూడా సమకూర్చలేకపోతున్నది. 

సైనికులకు ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఆర్మీ వాహనాలు, యుద్ధ ట్యాంకులు తరలించేందుకు ఇంధనం కూడా లేదని తెలుస్తున్నది. ఫైటర్ జెట్ల ఫ్యూయెల్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. సైనికులకు ఇచ్చే రేషన్​లోనూ కోత పెట్టింది. యుద్ధ విన్యాసాలు ఆపేసింది. పెట్రోల్, డీజిల్ లేక సైనిక వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

హెచ్చరికలే తప్ప.. చేతల్లో జీరో

పహల్గాం ఉగ్రదాడి కారణంగా ఇండియా తమపై దాడి చేస్తే పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుందని ఆ దేశ నేతలు, ఆర్మీ అధికారులు ప్రకటిస్తున్నా.. అక్కడ పరిస్థితి అసలు బాగోలేదని సమాచారం. అందరూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్ నేతలు చేస్తున్న హెచ్చరికలకు, అక్కడి పరిస్థితులకు అసలు పొంతనే లేదని సమాచారం. ఇండియన్ ఆర్మీ ముందు.. పాకిస్తాన్ ఎక్కువ రోజుల నిలబడలేదని తెలుస్తున్నది. 

ఇండియాతో యుద్ధం చేసేందుకు అవసరమైన 155 ఎంఎం షెల్స్ (ఎం109 హౌట్జర్​ల కోసం), 122 ఎంఎం రాకెట్లు సరిపడా లేవని సమాచారం. ఆయుధాలు స్టోర్ చేసే గోదాములన్నీ.. దాదాపు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. తుపాకులు, రాకెట్ లాంచర్లు ప్రదర్శన వస్తువులుగా మారాయి. మందుగుండు సామాగ్రి లేకపోవడంతో రక్షణ శాఖ అధికారులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. కాగా, పాక్​ వద్ద బాలిస్టిక్ మిస్సైల్స్ (షాహీన్ సిరీస్, అబాబీల్) న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఈ ఆయుధాలు ఇండియాను కొంత వరకు ఎదుర్కొనేందుకు ఉపయోగపడ్తాయి. పాకిస్తాన్ తన మందుగుండు నిల్వ కేంద్రాన్ని అత్యవసర స్థితిలో వాడుకునేందుకు సరిహద్దుల్లోనే ఏర్పాటు చేసింది.