కాళేశ్వరం దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్: కర్నె

కాళేశ్వరం దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్: కర్నె

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని కన్నుల పండువగా నిర్వహించనుంది ప్రభుత్వం. ఇందుకోసం భారీగా  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21 న ప్రాజెక్టు దగ్గర శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబురాలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రారంభోత్సవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రారంభ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర మొదటి పూజ, హోమం చేయనున్నారు. తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్  ప్రారంభోత్సవం జరగనుంది. కన్నెపల్లి పంపుహౌజ్  దగ్గర తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులకు స్విచ్  ఆన్  చేస్తారని అధికారులు చెప్తున్నారు. అక్కడ 45 నిమిషాలు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు.

గోదావరి జలాలను గ్రావిటీ కాలువలో ఎత్తిపోసే స్థలం దగ్గర 30 నిమిషాలకు పైగా పూజా కార్యక్రమాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. కన్నెపల్లి పంపుహౌజ్  దగ్గర సీఎం కేసీఆర్ వరుణున్ని ఆహ్వానించే హోమం చేస్తారని సమాచారం. ప్రారంభోత్సవం తర్వాత స్వామి సన్నిధానంలో గోదావరి జలాలతో ఆయన అభిషేకం నిర్వహిస్తారని తెలుస్తుంది. తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో శృంగేరి పీఠం పండితులు నిన్న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్  ప్రాంతాలను సందర్శించారు. ప్రత్యేక పూజలకు అనువైన స్థలాలను పరిశీలించారు. మేడిగడ్డ, కన్నెపల్లి దగ్గర నిర్వహించనున్న యాగాలకు జలసంకల్ప యాగాలుగా నామకరణం చేశారు.  ప్రారంభోత్సవ ఏర్పాట్లతో కన్నెపల్లి పంపుహౌజ్  వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు.

అనుకున్న టైమ్ కు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు TRS MLC కర్నె ప్రభాకర్. దేశంలోనే కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నారు.  ప్రాజెక్టు ప్రారంభానికి ఏపీ సీఎం జగన్ ను రావొద్దని కాంగ్రెస్ నేతలు చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. గతంలోనూ మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రధానిని రావొద్దని పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ రాశారని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు కర్నె ప్రభాకర్.