కాళేశ్వరం పనుల్లో కదలిక .. భూ సేకరణ బకాయిల కోసం రూ.23 కోట్లు రిలీజ్​

కాళేశ్వరం పనుల్లో కదలిక .. భూ సేకరణ బకాయిల కోసం రూ.23 కోట్లు రిలీజ్​
  • కొండెం చెరువు వద్ద రిజర్వాయర్​ను పరిశీలిస్తున్న ఇంజినీర్లు
  • లక్షా 50వేల ఎకరాలకు అందనున్న సాగునీరు​
  • సస్యశ్యామలం కానున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు  

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకు సాగు నీళ్లు అందించే కాళేశ్వం ( ప్రాణహిత- చేవెళ్ల) ప్యాకేజీ 22 పనుల్లో కదలిక వచ్చింది.  భూ సేకరణ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఇటీవల రూ. 23.15 కోట్లు రిలీజ్ చేసింది.  ప్యాకేజీ 21 నుంచి 22 ప్యాకేజీకి నీళ్లు వచ్చే కొండెం చెరువు వద్ద రిజర్వాయర్ కుదింపు అంశాన్ని ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. ముంపు సమస్య లేకుండా పాత పద్ధతిలోనే రిజర్వాయర్ నిర్మించాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరిన్ని ఫండ్స్ కేటాయించి పనులు ముందుకెళ్లేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్యాకేజీ 22 ద్వారా లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుండడంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయి.   

గతంలో  కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే ప్రాణహిత- చేవెళ్ల పేరిట పనులు షురూ చేశారు. సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణంతో పాటు,  మెయిన్​ కాల్వల తవ్వకం పనులు చేపట్టారు. తర్వాత  బీఆర్ఎస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చింది.  ఫండ్స్ కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ ప్యాకేజీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. ప్రధానంగా  1500 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది.  

ప్యాకేజీ 21 నుంచి ప్యాకేజీ 22 కు నీళ్లు వచ్చే రిజర్వాయర్ నిజామాబాద్​ జిల్లా కొండెం చెరువు వద్ద నిర్మించడం, కామారెడ్డి జిల్లాలో  రిజర్వాయర్లు, కాల్వల పనులు కంప్లీట్ కావాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత రైతుల్లో  ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్​ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి హైదరాబాద్​లో రివ్యూ చేశారు.  కొండెం చెరువు వద్ద రిజర్వాయర్​ నిర్మాణం,  భూ సేకరణ,  కాల్వల తవ్వకం,  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రిజర్వాయర్ల నిర్మాణంపై  చర్చించారు. 

పాత పద్ధతిలోనే రిజర్వాయర్..​  

కొండెం చెరువు వద్ద రిజర్వాయర్​ను  పాత పద్ధతిలోనే నిర్మించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.  ప్రాజెక్ట్​ డిజైన్​ టైంలో 0.8 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్​ ప్రతిపాదించారు.  ఇక్కడి నుంచి ప్యాకేజీ 22కు నీళ్లు వస్తాయి. తర్వాత ఇక్కడ 3.5 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్​కు ప్రపోజల్ చేశారు.  కెపాసిటీ పెంపు ప్రపోజల్​పై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  ముంపు ఏరియా ఎక్కువవుతుండటంతో స్థానికులు వ్యతిరేకించారు. 

 దీంతో పాత డిజైన్​ ప్రకారమే రిజర్వాయర్​ నిర్మించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. 0.8 టీఎంసీల నుంచి 1 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్​ నిర్మించేలా  ఉన్నతాధికారుల కమిటీ అధ్యయనం చేయనుంది.  రిజర్వాయర్​ కెపాసిటీ తగ్గిస్తే  స్థానికుల నుంచి అభ్యంతరాలు రావని అధికారులు భావిస్తున్నారు. కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అడ్మినిస్ర్టేషన్ శాంక్షన్​ రావాల్సి ఉంది.

భూ సేకరణకు అమౌంట్​ 

కాల్వల తవ్వకానికి గతంలో సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో భూ సేకరణ చేపట్టారు.  రైతులకు అమౌంట్ చెల్లింపు ఆగిపోయింది. 316 ఎకరాల భూ సేకరణ బకాయి చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 23 కోట్ల 15 లక్షలు రిలీజ్ చేసింది. మిగిలిన భూ సేకరణ, భూంపల్లి వద్ద రిజర్వాయర్, యాచారం వద్ద సొరంగ మార్గం, కాల్వల తవ్వకం వంటి పనులకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఫండ్స్ కేటాయించాలని జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కోరారు.  

సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం   

కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులకు ప్రభుత్వం రూ. 23 కోట్లు రిలీజ్​ చేయడంతో ఆదివారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్​ చౌరస్తాలోని  ప్రాజెక్టు ఫైలాన్​ వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ ఫొటోకు  కాంగ్రెస్ లీడర్లు క్షీరాభిషేకం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,  జిల్లా లైబ్రరీ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి మాట్లాడుతూ జిల్లా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. షబ్బీర్​అలీ ఫండ్స్ రిలీజ్ చేయించారన్నారు.