
- బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే
- కమీషన్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నరు
- ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పథకాలు అమలు చేస్తున్నం
- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
- క్యాతనపల్లిలో మెప్మా భవనాన్ని ప్రారంభించిన మంత్రి
కోల్‌బెల్ట్/సిద్దిపేట, వెలుగు: పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నదని అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఠాగూర్ స్టేడియం వద్ద రూ.5 లక్షలతో నిర్మించిన మెప్మా భవనాన్ని ప్రారంభించి వివేక్ మాట్లాడారు.
‘‘సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖను అడ్డంపెట్టుకుని తప్పుడు కేసులు బనాయించింది. మా పాలనలో అలాంటి అక్రమ కేసులకు చోటు లేదు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నం. సన్న బియ్యం కోసం ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నం. పదేండ్లలో కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పులపాల్జేసిండు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు’’అని మంత్రి వివేక్ అన్నారు.
మరిన్ని ఇండ్లు కేటాయిస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని మంత్రి వివేక్ అన్నారు. ‘‘మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించినం. మరికొన్ని త్వరలో అలాట్ చేస్తాం. మందమర్రి మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రూ.50 కోట్లతో త్వరలో మరికొన్ని అభివృద్ధి పనులు చేపడ్తాం. 30 కోట్లతో అమృత్ స్కీం ద్వారా తాగునీరు సప్లై పనులు చేపట్టినం’’అని మంత్రి వివేక్ అన్నారు.
మహిళలకు వడ్డీలేని రుణాలిస్తున్నం
మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తున్నదని వివేక్ అన్నారు. ‘‘మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తున్నం. రూ.21వేల కోట్ల లోన్లను మహిళలకు మా ప్రభుత్వం అందజేసింది. అందరికీ గ్యాస్ సబ్సిడీ వచ్చేలా ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు చొరవ చూపాలి’’అని మంత్రి వివేక్ అన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కొత్త గనులు వస్తేనే ఉపాధి దొరుకుతదని చెప్పారు. అనంతరం 25 మహిళా సంఘాలకు రూ.2 కోట్ల బ్యాంకు రుణాల చెక్కును అందజేశారు. మందమర్రిలోని బీ-1 క్యాంప్ ఆఫీస్‌లో 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా, అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణాపూర్‌కు చెందిన సీనియర్ లీడర్, మాజీ జడ్పీటీసీ ఎండీ.యాకుబ్ అలీని మంత్రి పరామర్శించారు.
సిద్దిపేటలో సాండ్ బజార్ ఏర్పాటు చేయిస్తా
పేదల ఎన్నో ఏండ్ల సొంతింటికల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నెరవేరుతున్నదని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలోని 37వ వార్డు, ఎన్సాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.
‘‘ఇండ్ల నిర్మాణ దశలను బట్టి బిల్లులు చెల్లిస్తున్నాం. అందుకే పనులు స్పీడ్‌గా జరుగుతున్నయ్. నాణ్యతతో ఇండ్లు నిర్మించుకుంటున్నారు. పేపర్లలో యాడ్స్ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సిద్దిపేట జిల్లా ముందున్నది. ఇసుక సమస్య లేకుండా త్వరలో సాండ్ బజార్ ఏర్పాటు చేయిస్తా’’అని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
ఎన్సాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మంత్రి వివేక్ సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.