మహదేవపూర్, వెలుగు: సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చిన భక్తుల శివ నామస్మరణతో కాళేశ్వరం మార్మోగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శనివారం (మే 30) ఉదయం 4 గంటల నుంచే త్రివేణి సంగమానికి చేరుకొని పుష్కర స్నానాలు ఆచరించారు.
కర్నాటక రాష్ట్రం భీమనకట్టే మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామీజీ పుష్కర స్నానం ఆచరించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి, శుభానందా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ఈవో మహేశ్ శేష వస్త్రాలు, జ్ఞాపికను అందించారు.
సరస్వతి ఘాట్ వద్ద నవరత్న మాల హారతి వైభవంగా జరిగింది. గోదావరిలో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. చతుర్దశి, విశాఖ నక్షత్రం సందర్భంగా ఆలయ రుత్వికులు ధన్వంతరి హోమాన్ని జరిపించారు.
