మాజీ సీఎస్ సోమేశ్​కు నోటీసులు!

మాజీ సీఎస్ సోమేశ్​కు నోటీసులు!
  •      నేడు విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశం

  •     ఇరిగేషన్ మాజీ సెక్రటరీలు రజత్​కుమార్, స్మితా సబర్వాల్,ఎస్కే జోషికి కూడా

  •     ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి సైతం 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేస్తున్నది. ఇన్ని రోజులు టెక్నికల్ అంశాలను తెలుసుకున్న కమిషన్.. సోమవారం నుంచి ఆర్థిక, విధాన పరమైన నిర్ణయాలపై అధికారుల నుంచి వివరాలు రాబట్టనుంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు పిలిచినట్టు తెలిసింది. మాజీ సీఎస్​ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పని చేసిన ఎస్కే జోషి, రజత్​కుమార్, స్మితా సబర్వాల్ కు కమిషన్ నోటీసులు అందజేసినట్టు సమాచారం. అదే విధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్​రాజ్, నాగిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. వీళ్లందరికీ కమిషన్​చైర్మన్​జస్టిస్ పీసీ ఘోష్​నోటీసులు పంపారని, సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

 టెండర్లు పిలిచిన విధానం? ఎన్ని టెండర్లు వచ్చాయి? ఎన్ని కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి? ఏ ప్రాతిపదికన టెండర్లు ఇచ్చారు? కాంట్రాక్ట్​లు ఇచ్చాక మళ్లీ సబ్​కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరమేంటి? తదితర అంశాలను తెలుసుకోవాలని కమిషన్​భావిస్తున్నది. ఇక ఆర్థిక శాఖ అధికారుల నుంచి ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత అంచనా వ్యయాలు ఎంతమేర పెరిగాయి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? కాంట్రాక్ట్​సంస్థలకు ఎంత చెల్లించారు? సబ్​కాంట్రాక్ట్​సంస్థలకు చెల్లింపులు తదితర వివరాలను రాబట్టనుంది.