కాళేశ్వరం టూర్ ఆగదు: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి

కాళేశ్వరం టూర్ ఆగదు: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి
  • ప్రభుత్వం ఆహ్వానిస్తే కేసీఆర్ రావొచ్చు కదా
  • మీడియాతో చిట్​చాట్​లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రపంచం గర్వించేలా లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టామని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు తమ ప్రభుత్వం టూర్​కు ఆహ్వానించినప్పుడు రావాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కోరారు. ఎవరొచ్చినా.. రాకున్నా.. తమ కాళేశ్వరం పర్యటన మాత్రం ఆగదని తేల్చి చెప్పారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మా పార్టీలో వచ్చేందుకు ట్రై చేస్తున్నరు. వారికి ఎంపీ టికెట్లు ఇవ్వలేం కదా.. మా పార్టీలోనే ఒక్కో సీటుకు ఐదారు మంది అప్లై చేసుకున్నరు.

మూడు పేర్లతో షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్​కు పంపించాం. వారంలోగా ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ వస్తది. అందెశ్రీకి పదవి ఇచ్చి గౌరవించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. కోదండరాం, అందెశ్రీ అంటే ఎంతో గౌరవం”అని నరేందర్ రెడ్డి అన్నారు. సీఎం తన ప్రతి స్పీచ్​లో గద్దర్, అందెశ్రీ పేర్లను ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ నెల 13న నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ ఉన్నట్టు తమకు తెలియదని చెప్పారు. 

స్పీకర్ పదవి నేనే వద్దన్నా: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

తనకు స్పీకర్ పదవి ఆఫర్ చేస్తే వద్దన్నానని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రెండో విడతలో మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘కేసీఆర్ మూర్ఖుడు. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు. రూ.2 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పనులు చేయిస్తే.. పైపుల కోసమే కేసీఆర్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాటిని తీయలేని పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్​బీసీకి కొన్ని నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. దానికీ నిధులు ఇవ్వలేదు’’అని సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు.