కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్పీ ఆదుకుంది..

కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్పీ ఆదుకుంది..
  • గత యాసంగిలో శ్రీరాంసాగర్​ నుంచే 9.13 లక్షల ఎకరాలకు నీళ్లు
  • మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరం నుంచి చుక్క నీరూ ఎత్తిపొయ్యలే
  • ఈ ప్రాజెక్టు కింది 96 వేల ఎకరాల ఆయకట్టుకూ ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు
  • గత సీజన్‌‌లో అత్యధికంగా నాగార్జునసాగర్​ కింద 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు
  • మొత్తంగా 45.64 లక్షల ఎకరాల ఆయకట్టుకు 342 టీఎంసీలు 
  • 42 లక్షల ఎకరాల టార్గెట్‌‌కు మించి నీళ్లు.. స్కివమ్ డేటాలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గత యాసంగిలో అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీళ్లు ఎత్తిపోయకున్నా 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో కాళేశ్వరం పంపులన్నీ ఆగిపోగా, ఎప్పట్లాగే రాష్ట్ర రైతులను శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) ఆదుకున్నది. గత యాసంగి సీజన్‌‌లో 42.11 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని పోయినేడాది డిసెంబర్‌‌‌‌లో నిర్వహించిన స్కివమ్​(స్టేట్​ లెవెల్​ కమిటీ ఆన్​ ఇంటిగ్రేటెడ్ ​వాటర్ ​ప్లానింగ్​ అండ్ మేనేజ్‌‌మెంట్) మీటింగ్‌‌లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 

ఇందుకు 365 టీఎంసీలు కావాలని అంచనా వేసింది. అయితే యాసంగి సీజన్ పూర్తయ్యేసరికి ఏకంగా 45.64 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది. అందుకు వాడుకున్న నీళ్లు కేవలం 342 టీఎంసీలే. అంటే నీటిని అత్యంత పొదుపుగా వాడుకుంటూనే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వడంలో ఇటు ప్రభుత్వం, అటు ఇరిగేషన్ అధికారులు సక్సెస్​అయ్యారు. తాజాగా వర్షాకాలానికి సంబంధించిన యాక్షన్​ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్వహించిన స్కివమ్​సమావేశంలోని అధికారిక లెక్కలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. 

9 జిల్లాలకు ఎస్సారెస్పీ నీళ్లు.. 

గత యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద మొత్తం 9,12,928 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందాయి. ఇందులో స్టేజ్​2 కింద 2,28,187 ఎకరాలకు నీళ్లందించడం విశేషం. ఎస్సారెస్పీ నీళ్లను తొమ్మిది జిల్లాల్లోని (కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, ఖమ్మం) ఆయకట్టుకు అందించడంలో ప్రభుత్వం సక్సెస్​అయింది. ఈ ప్రాజెక్టు స్టేజ్​2 కింద వరంగల్​జిల్లాలో 74,193 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 1,21,379 ఎకరాలు, ఖమ్మంలో 32,615 ఎకరాలకు నీళ్లిచ్చింది. మొత్తంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు 64 టీఎంసీలు ఇచ్చింది. 

ఇక గత యాసంగిలో అత్యధికంగా నాగార్జునసాగర్​ ప్రాజెక్టు కింద నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని 9,49,484 ఎకరాలకు ప్రభుత్వం నీళ్లిచ్చినట్టు స్కివమ్​డేటాలో వెల్లడైంది. ఇందుకోసం 86.72 టీఎంసీలు వినియోగించారు. నాగార్జునసాగర్​ తర్వాత శ్రీరాంసాగర్​ప్రాజెక్ట్​కింది ఆయకట్టుకే ఎక్కువ నీళ్లివ్వగలిగారు. 

కాళేశ్వరం ఎత్తిపోతల్లేవ్.. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెబుతున్న గత ప్రభుత్వ పెద్దల మాటలన్నీ ఉత్తవేనని మరోసారి స్పష్టమైంది. ఈ ఏడాది కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాకున్నా ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఆ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల నుంచి నీళ్లను ఎత్తిపోయలేదు. అయినప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లతో కాళేశ్వరం ఆయకట్టుకు ఢోకా లేకుండా చూశారు. 

దీని ద్వారా కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్​కింద 96,070 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లిచ్చినట్టు స్కివమ్​డేటాలో వెల్లడైంది. అందుకు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన 7.314 టీఎంసీలను మళ్లించడం విశేషం. 

తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి ఉంటే మరింత మేలు..

గత బీఆర్ఎస్​ప్రభుత్వం నీటి లభ్యత లేదని చెప్పి.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై చేపట్టాల్సిన బ్యారేజీ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చింది. కానీ ప్రస్తుతం గోదావరికి వరద లేకున్నా.. ఎగువన ప్రాణహిత నుంచి వరద వస్తున్నది. ఒకవేళ నాడు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి ఉంటే ఒకే ఒక్క లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజీ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చడం, అది బ్యారేజీల నిర్మాణానికి అనువుగా లేకపోవడంతో.. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వాడుకోలేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 

కాగా,  ఆ బ్యారేజీలు లేకుండానే గోదావరి జలాలతో ప్రాజెక్టులు నిండి గత యాసంగి లక్ష్యం కన్నా ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వగలిగామని అధికారులు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడం, నీటిని పొదుపుగా వాడుకోవడం వల్ల ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వగలిగామని పేర్కొంటున్నారు. 


కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల కింద గత యాసంగి ఆయకట్టు (ఎకరాల్లో), నీటి వినియోగం (టీఎంసీల్లో)

             ప్రాజెక్ట్                 ఆయకట్టు    నీటి వినియోగం

  • నాగార్జున సాగర్    9,49,484           86.72
  • శ్రీరాంసాగర్          9,12,928             64
  • కల్వకుర్తి               2,43,534         25.597
  • దేవాదుల             1,73,202             9.37
  • జూరాల                45,551               4.26
  • నెట్టెంపాడు         48,000               2.65
  • రాజోలిబండ       41,651                3.97