రూ.200 కోట్ల న‌ష్ట ప‌రిహారం: హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్‌/ప్రశాంత్ వర్మ వివాదం.. అసలేం జరిగింది?

రూ.200 కోట్ల న‌ష్ట ప‌రిహారం: హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్‌/ప్రశాంత్ వర్మ వివాదం.. అసలేం జరిగింది?

హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.290 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై హనుమాన్ సినిమాను నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించి, మంచి లాభాలు గడించారు. ఇదంతా.. అందరికీ తెలిసిందే.

అయితే, వీరి మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి.. ఒకరిపై మరొకరు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖలు సమర్పించడంతో అసలు వివాదం మరింత వెలుగులోకి వస్తుంది. వీరి మధ్య నెలకొన్న సమస్యలను తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ విచారిస్తోంది. ఈ క్రమంలో ఇలా వీరి ఇరువురు ఒకరిపై ఒకరు ఏం మాట్లాడుకున్నారో వారి కంప్లైంట్స్ ఆధారంగా పరిశీలిస్తే.. 

ప్రశాంత్ వర్మపై నిరంజన్ రెడ్డి కంప్లైంట్:

హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ప్రశాంత్ వర్మతో పలు మూవీస్ డిస్కస్ జరిగినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు తమ బ్యానర్‌పై డైరెక్ట్ చేస్తానని హామీ ఇచ్చి రూ 10.34 కోట్లు అడ్వాన్స్ ప్రశాంత్‌ వర్మ తీసుకున్నారని నిరంజన్‌ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తూ 6 పేజీల లేఖ సమర్పించారు. ఇందులో భాగంగా తమ వద్ద డబ్బు తీసుకుని సినిమాలు చేయడం లేదని నిర్మాతల మండలిలో ప్రశాంత్‌పై కంప్లైంట్ చేశారు.

అంతేకాక, పైగా రూ.10.23 కోట్లు ఖర్చు పెట్టించి.. వేరే నిర్మాతల దగ్గర ఉన్న ఆక్టోపస్ సినిమాని కూడా తన చేత ప్రశాంత్‌ కొనిపించారు. ఆ సినిమాకు సంబంధించి అవసరమైన NOC (No Objection Certificate) కూడా ఇప్పించలేదని ఆరోపించారు. ఇపుడు ఈ ఐదు సినిమాల మొత్తం లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ (Loss of Business Opportunity) కింద ప్రశాంత్ వర్మ నుంచి తమకు రూ.200 కోట్లు నష్టపరిహారం కావాలని నిర్మాత నిరంజన్ రెడ్డి కోరారు. 

అలాగే, నిర్మాత చేసిన నిరంజన్ కంప్లైంట్ లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ప్రశాంత్ వర్మ తనతో ఒప్పందం చేసుకున్న అధీర, మహాకాళి మూవీస్ ఇప్పుడు వేరే బ్యానర్ లో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ఈ రెండు సినిమాలు తన బ్యానర్‌పై కాకుండా RKD స్టూడియోస్ పేరుతో ప్రకటించారని, అలాగే జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లపై తెరకెక్కుస్తున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తనకు ఆర్థిక పరిష్కారం క్లియర్ అయ్యే వరకు.. ఈ ఐదు సినిమాల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ను కోరారు. 

ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్:

కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానెల్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదు వివరాలను, అలాగే నా సమాధానం లోని కొన్ని భాగాలను మాత్రమే ప్రచురించడం, ప్రసారం చేయడం నా దృష్టికి వచ్చింది. ఈ పక్షపాత, బాధ్యతారహిత, ఏకపక్ష సమాచారం ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

►ALSO READ | Ramya Krishnan, RGV: ‘భూత్‌ పోలీస్‌ స్టేషన్‌’లో‌ రమ్యకృష్ణ.. వరుస ఫోటోలతో హీట్ పెంచుతున్న ఆర్జీవీ

నాకు, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ / తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు విచారణలో, న్యాయ పరిశీలనలో ఉంది. ఈ సందర్భంలో అన్ని పక్షాలు ఆ ఫోరమ్ తీర్పును ఎదురు చూడటం మాత్రమే సమంజసం. మీడియా ద్వారా వివాదాన్ని తీర్చే ప్రయత్నం చేయడం సరైంది కాదు.

ఈ దశలో అంతర్గత పత్రాలు, ఇమెయిల్స్, ఒప్పందాలు లేదా ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడం అనేది విచారణలో జోక్యం చేసుకోవడం వంటి చర్య అవుతుంది. ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో జరుగుతోంది. నా మీద చేసిన అన్ని ఆరోపణలు అసత్యం, నిరాధారం, ప్రతీకారపూరితమైనవే అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.

అన్ని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్స్, సోషల్ మీడియా ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ ఈ అంశంపై ఊహాగానాలు ఆధారంగా ప్రచారం చేయడం మానుకోవాలని, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ విచారణ ఫలితం వచ్చే వరకు వేచి చూడమని కోరుతున్నానని" డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కోరారు. అంతేకాకుండా, హనుమాన్ సినిమా ద్వారా ఇప్పటి వరకు నాకు కేవలం 15.82 కోట్లు మాత్రమే అందింది. హనుమాన్‌ మూవీకి వచ్చిన లాభాల్లో నా వాటను ఎగరగొట్టేందుకే ఈ స్టోరీ ప్లాన్‌ చేశారని ప్రశాంత్ ఆరోపిస్తున్నారు. 

నిర్మాతల మండలి/ కోర్టు:

ఇపుడు వీరి లేఖలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేకెతిస్తున్నాయి. అసలు ఇందులో ఎవరు నిజం చెబుతున్నారు, న్యాయం ఎవరివైపు ఉంది? వీరి మధ్య జరిగిన అసలైన లావాదేవీలు ఎలా ఉన్నాయి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో వీరి మధ్య నెలకొన్న ఆర్ధిక సమస్యలను నిర్మాతల మండలి పరిష్కరిస్తుందా ? లేక కోర్టుకు వరకు వెళ్లాల్సి వస్తుందా అనేది ఆశ్చర్యార్థకంగా మిగిలింది.